ప్రశ్నార్ధకరంగా మారిన సోనియా కుటుంభ అధిపత్యం

ఒక కేంద్రపాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చతికల పడడంతో ఆ పార్టీపై దశాబ్దాలుగా ఆధిపత్యం వహిస్తున్న సోనియా కుటుంభంకు రాజకీయంగా తీవ్ర పరాభవంగా పరిశీలకులు భావిస్తున్నారు. దీనితో కాంగ్రెస్ పార్టీపై సోనియా కుటుంభం పట్టు సడలించాలని కొంతకాలంగా బహిరంగంగా అసమ్మతి స్వరాలు వినిపిస్తున్న సీనియర్ నేతలకు బలం చేకూర్చిన్నట్లు అవుతున్నది. 

పశ్చిమ బెంగాల్‌, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడిపోవడంతో ఆ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. తమిళనాడులో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్న డీఎంకే నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రా వడం స్వల్ప ఊరటను మినహాయిస్తే మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఓటమి చవిచూసింది. పుదుచ్చేరిలోనూ చుక్కెదురయ్యింది. 

అసోం, కేరళలో  తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ బాగా దెబ్బతింది. పశ్చిమ బెంగాల్‌లో అయితే ఖాతా కూడా తెరవలేకపోయింది.  కాంగ్రెస్‌ పరాజయం జాతీయ రాజకీయ సమీకరణలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

తమ పార్టీకి మాత్రమే జాతీయ దృక్పథం, రాజకీయ ఉనికి ఉందని కాంగ్రెస్‌ చెప్పుకున్నా….ఆ పార్టీ సొంతం గా పంజాబ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలలోనే అధికారంలో ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఇతర పార్టీలతో అధికారాన్ని పం చుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లో జూన్‌ నాటికి కాంగ్రె్‌సకు కొత్త అధ్యక్షుడు వస్తారని సీడబ్ల్యూసీ జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో పార్టీలో అసమ్మతి స్వరాలు పెరగనున్నాయి.

కేరళలో గత లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. కూటమిని నడిపించే బలమైన నాయకత్వం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. వయనాడ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి కూడా ఈ ఓటమి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. 

చాలా చోట్ల అభ్యర్థులను మార్చి కొత్త వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం చేటు చేసింది. సీట్ల పంపకాల అనంతరం పార్టీ రెండుగా చీలింది. బీజేపీ దూకుడుగా ప్రచారం నిర్వహించడంతో ఆ పార్టీని నిలువరించేందుకు ముస్లింలు, మైనార్టీలు ఎల్డీఎఫ్‌కే మొగ్గు చూపారు. 

అదేసమయంలో జోస్‌ కే మణి సారథ్యంలోని కేరళ కాంగ్రెస్‌ (ఎం)ని చివరి నిమిషంలో విజయన్‌ తమ కూటమిలో చేర్చుకోవడం ఆ పార్టీకి లాభించింది. గణనీయ స్థాయిలో ఉన్న క్రిస్టియన్లు ఆ కూటమివైపు మళ్లారు. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో రాహుల్ ప్ర‌చారం చేసిన రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది.