ప‌శ్చిమ బెంగాల్‌లో పాక్షిక లాక్‌డౌన్ ఆంక్ష‌లు

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అలా ఎన్నిక‌లు ముగిశాయో లేదో ఇలా పాక్షిక లాక్‌డౌన్‌ను విధించారు. కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలో పాక్షిక ష‌ట్‌డౌన్ ప్రకటించింది. మార్కెట్లు ప్రతిరోజూ ఐదు గంటలు మాత్రమే పనిచేయడానికి అనుమతించారు.

ప‌శ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మే 2 న ఓట్ల లెక్కింపు జ‌రుగ‌నున్న‌ది. దీనికి ముందుగా కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. రేప‌టి నుంచి బెంగాల్‌లోని అన్ని షాపింగ్ కాంప్లెక్సులు, మాల్స్, బ్యూటీ పార్లర్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పాస్, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదే సమయంలో మార్కెట్లు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు మాత్రమే తెరిచేందుకు అనిమ‌తిస్తున్నారు. అన్ని సామాజిక, సాంస్కృతిక, వినోదం, విద్యా సంబంధ‌ సమావేశాల‌పై నిషేధం విధించారు. అయితే, ఫార్మసీలు, వైద్య పరికరాలను విక్రయించే దుకాణాలు, కిరాణా దుకాణాలను పాక్షిక లాక్‌డౌన్ నుంచి మినహాయించారు.

మ‌హారాష్ట్ర‌లో క‌ఠిన లాక్‌డౌన్ అవ‌స‌రం లేద‌ని సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే తెలిపారు. ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తున్నార‌ని, రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితి మెరుగుప‌డుతున్న‌ద‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌నుద్దేశించి శుక్ర‌వారం ఆయ‌న టీవీలో ప్ర‌సంగించారు. ఆంక్ష‌లు, లాక్‌డౌన్ వ‌ల్ల‌నే క‌రోనాను నియంత్రించ‌గ‌ల‌మ‌ని ఉద్ధ‌వ్ అన్నారు. క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప‌ది ల‌క్ష‌ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేశామ‌ని, అయితే ఇది ఏడు ల‌క్ష‌లుగా ఉన్న‌ద‌ని తెలిపారు. వైద్య సౌక‌ర్యాల‌ను పెంచుతున్నామ‌ని, అయితే వైద్య నిఫుణుల కొర‌త ఉన్న‌ద‌ని చెప్పారు.

క‌రోనా వైర‌స్ మ‌నిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందే క్ర‌మాన్ని నివారించ‌డంలో ప్ర‌జ‌లు ఉద్య‌మ స్ఫూర్తితో భాగ‌స్వాములు కావాల‌ని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ్ దీప్ గులేరియా విజ్ఞ‌ప్తి చేశారు. వైర‌స్ చైన్ ను బ్రేక్ చేయ‌డ‌మే మ‌న ముందున్న క‌ర్త‌వ్య‌మ‌ని చెప్పారు.

స్వ‌ల్ప కొవిడ్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డేవారు హోం ఐసోలేష‌న్ తో బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఇక క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్ల భ‌యాందోళ‌న‌లు వీడాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ కోరారు.

కొవిడ్-19 రోగులు వారి కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఆడియో, వీడియో కాల్స్ స‌దుపాయం ఏర్పాటు చేసేలా ఆస్ప‌త్రులు చొర‌వ తీసుకోవాల‌ని సూచించారు. క‌రోనా ప‌ట్ల భ‌యం ముసురుకునే వాతావ‌ర‌ణం తొల‌గించే చ‌ర్య‌లు అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ త‌మ‌ను ఏమీ చేయ‌ద‌ని మొండిగా వ్య‌వ‌హ‌రించం త‌గ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.