వందేళ్ల‌కోసారి వ‌చ్చే సంక్షోభం ఇది 

క‌రోనా మ‌హ‌మ్మారిని వందేళ్లకోసారి వ‌చ్చే సంక్షోభంగా అభివ‌ర్ణించింది కేంద్ర ప్ర‌భుత్వం. శుక్ర‌వారం కేబినెట్ స‌మావేశం త‌ర్వాత కేంద్రం ఈ వ్యాఖ్య‌లు చేసింది. క‌రోనా ప్ర‌పంచానికి పెను స‌వాలునే విసిరింద‌ని, దానిని స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డానికి ప్ర‌భుత్వంలోని అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపింది.
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో మ‌హ‌మ్మారిని నియంత్రించ‌డానికి గ‌త 14 నెల‌ల్లో కేంద్ర, రాష్ట్రాలు తీసుకున్న చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. ఇక ఇప్ప‌టికే మూడు వ్యాక్సిన్ల అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వ‌గా.. మ‌రికొన్ని వ్యాక్సిన్లు వివిధ ద‌శ‌ల్లో ఉన్న‌ట్లు కేంద్రం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.
ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియాలో త‌యార‌వుతున్న రెండు వ్యాక్సిన్ల 15 కోట్ల డోసుల‌ను వేసిన‌ట్లు తెలిపింది. మంత్రులంద‌రూ త‌మ త‌మ ప్రాంతాల ప్ర‌జ‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడూ ట‌చ్‌లో ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ సూచించారు.
స్థానికంగా ఉన్న స‌మస్యలను వెంట‌నే గుర్తించి, ప‌రిష్క‌రించాల‌ని కూడా ఆయ‌న మంత్రుల‌ను ఆదేశించారు. దేశంలో ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు సంబంధించి మౌలిక వ‌స‌తుల‌ను మెరుగుప‌ర‌చ‌డం, హాస్పిట‌ల్స్ బెడ్స్‌ను పెంచ‌డం, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, ఉత్ప‌త్తిని పెంచ‌డం వంటి అంశాల‌పై కూడా చ‌ర్చించారు. ఈ కేబినెట్ స‌మావేశం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రిగింది.