సొలి సొరాబ్జీ కరోనాతో కన్నుమూత

సొలి సొరాబ్జీ కరోనాతో కన్నుమూత

కరోనా మహమ్మారి మరో ప్రముఖుడిని బలితీసుకున్నది. మాజీ అటార్జీ జనరల్‌, పద్మవిభూషణ్‌ సొలి జహంగీర్‌ సొరాబ్జీ కరోనాతో కన్నుమూశారు. 91 ఏండ్ల వయస్సున్న ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

సొలి సొరాబ్జీ 1930లో ముంబైలో జన్మించారు. 1953లో బాంబే హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 1971లో సుప్రీంకోర్టు సీనియర్‌ కౌన్సిల్‌గా గుర్తించింది. తర్వాత కొంతకాలానికి ఆయన అటార్జీ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా నియమితులయ్యారు. మొదటిసారి 1989-90, రెండోసారి వాజపేయి హయాంలో  1998-2004 వరకు ఏజీఐగా వ్యవహరించారు.

ఉదారవాద విధానాల కోసం, పౌర హక్కుల కోసం జీవితాంతరం రాజీలేని పోరాటం జరిపారు. మానవ హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసిన సోరబ్జీ… 1997లో నైజీరియాలో ఐరాస ప్రత్యేక రిపోర్టర్‌గా నియమితులయ్యారు. అనంతరం ఐరాస మానవ హక్కుల భద్రత, ప్రచార సబ్ కమిషన్‌లో చేరి… అదే సంస్థకు 1998 నుంచి 2004 వరకు చైర్మన్‌గా పనిచేశారు.

ఐక్యరాజ్య సమితి మైనారిటీల సంక్షేమం, వివక్ష నియంత్రణ సబ్ కమిషన్‌లో కూడా సోరబ్జీ సభ్యుడిగా కొనసాగారు. 2000 నుంచి 2006 వరకు హేగ్‌లోని ఐరాస అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్యుడిగా సేవలు అందించారు. 2002లో భారత రాజ్యాంగ పనితీరును సమీక్షించేందుకు ఏర్పాటైన కమిషన్‌లో సోరబ్జీ సభ్యుడిగా పనిచేశారు. వీటితో పాటు సుప్రీంకోర్టులోని అనేక కీలక కేసుల్లో ఆయన వాదనలు వినిపించారు.

వాక్ స్వాతంత్ర్యం, మీడియా స్వేచ్చ, పోలీసుల అధికారాలకు పరిమితులు విధించడం, ప్రధాన మంత్రులు, గవర్నర్ల మోసాల నుంచి శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడడం తదితర అంశాలపై ఆయన గళం వినిపించారు. జాజ్‌ను అమితంగా ఇష్టపడే ఆయనకు గొప్ప రచయితగానూ పేరుంది. 

సొలి సొరాబ్జీ మృతిపట్ల సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సంతాపం తెలిపారు. ప్రాథమిక, మానవ హక్కుల పరిరక్షణకు సొరాబ్జీ కృషి మరువలేనిదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాల బలోపేతానికి కృషి చేశారన్నారు.