దేవినేని ఉమను 9 గంటలు ప్రశ్నించిన సిఐడి 

దేవినేని ఉమను 9 గంటలు ప్రశ్నించిన సిఐడి 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియోలను మార్ఫింగ్‌ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం నాడు మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆయన ఈ విచారణకు హాజరయ్యారు. 

ఉదయం 11 గంటలకు సిఐడి కార్యాలయానికి వచ్చిన దేవినేనిని దాదాపు తొమ్మిది గంటల పాటు విచారించారు. ‘ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు ఎవరు సృష్టించారు? అవి ఎక్కడ నుండి వచ్చాయి?’ అనే అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే వీడియోలు ప్రదర్శించిన ఫోన్‌లు ఎక్కడ వున్నాయని కూడా విచారణాధికారులు ఆరా తీసినట్లు సమాచారం. 

మే 1న మరోసారి విచారణకు హాజరు కావాలని దేవినేనికి ఆదేశించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు తగిన ఆధారాలను, ఫోన్‌ తదితరాలను అందజేయాలని నిర్దేశించారు. విచారణ అనంతరం దేవినేని మీడియాతో మాట్లాడారు. 

టిడిపి అధినేత చంద్రబాబే తనతో సెల్‌లో వీడియో ప్లే చేయించినట్లుగా చెప్పాలని సిఐడి అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. జగన్‌ తప్పుడు కేసులతో తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. 

 తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌పై వీడియో మార్ఫింగ్‌ చేసి విలేకరుల సమావేశంలో చూపించి సీఎం పరువుకు భంగం కలిగించారని దేవినేని ఉమపై కర్నూలు జిల్లా వైసీపీ లీగల్‌ సెల్‌ అడ్వకేట్‌ నారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్‌ 10న సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఐపీసీ సెక్షన్లు 464, 465, 468, 469, 470, 471, 505, 120(బి) కింద అభియోగాలు నమోదు చేశారు. తనపై పెట్టిన కేసులో దురుద్ధేశం ఉందంటూ హైకోర్టులో ఉమ క్వాష్‌ పిటిషన్‌ వేశారు. అయితే అరెస్టు చేయరాదంటూ సీఐడీకి షరతు విధిస్తూ విచారణకు హాజరు కావాలని ఉమను న్యాయస్థానం ఆదేశించింది.