దేశీయంగా అభివృద్ధిపరిచిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతమైనది – ఐసీఎంఆర్

దేశీయంగా అభివృద్ధిపరిచిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది.

డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌పై కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని, సార్స్-కోవ్-2కు చెందిన వేర్వేరు రూపాలను నిర్వీర్యం చేస్తోందని తెలిపింది. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనికి మన దేశంలో కోవిడ్-19 చికిత్సలో అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మరొక 60 దేశాల్లో కోవాగ్జిన్ వినియోగానికి అనుమతుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది.

ఐసీఎంఆర్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఎస్ఏఆర్ఎస్- సీఓవీ-2 (సార్స్-కోవ్-2)కు చెందిన వివిధ రూపాలను కోవాగ్జిన్ ధ్వంసం చేసినట్లు ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది.

అంతేకాకుండా డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌ను కూడా సమర్థవంతంగా నాశనం చేసినట్లు వెల్లడైంది.

యూకే వేరియెంట్, బ్రెజిల్ వేరియెంట్‌లపై కోవాగ్జిన్ సామర్థ్యాన్ని ఐసీఎంఆర్-ఎన్ఐవీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) వివరించాయి.

డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్ బి.1.617 సార్స్-కోవ్-2ను మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపాయి.

దీనిని వేరుపరచి, వర్గీకరించడంలో విజయం సాధించినట్లు తెలిపాయి.

డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌ను నాశనం చేయడంలో కూడా కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని గుర్తించినట్లు వివరించాయి.