సమిష్టిగా యుద్దం చేస్తేనే వైరస్‌ గొలుసు విచ్ఛిన్నం – గవర్నర్ బిశ్వభూషణ్

-కరోనా వ్యతిరేక అవగాహనా ప్రచారంలో విద్యార్ధుల భాగస్వామ్యం అవసరం
-విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో గవర్నర్ దృశ్య శ్రవణ విధాన సదస్సు

కరోనా మహమ్మారి విసిరిన భారీ సవాలును ఎదుర్కోవటానికి ఉపకులపతి మొదలు విద్యార్ధి వరకు అందరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అదృశ్య శత్రువుపై అందరూ సమిష్టిగా యుద్దం చేస్తేనే వైరస్‌ గొలుసును విచ్ఛిన్నం చేయగలుగుతామన్నారు. విజయవాడ రాజ్ భవన్ వేదికగా ఉన్నత విద్యసంస్ధలలో కరోనా పరిస్ధితులను అధికమించటం, విద్యార్ధుల ద్వారా కరోనా వ్యతిరేక అవగాహనా ప్రచారం నిర్వహించటంపై గవర్నర్ రాష్ట్రంలోని అయా విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో వెబినార్ విధానంలో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

రెండోవ విడత కరోనా వ్యాప్తి వేగవంతమైన తరుణంలో విద్యాసంస్ధలలో అవసరమైన అన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థలు ప్రజల పట్ల పెద్ద బాధ్యత కలిగిఉన్నాయని, ప్రజలలో అవగాహన కలిగించేందకు కృషి చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు తమను తాము కాపాడుకుంటూ అటు కుటుంబానికి, ఇటు సమాజానికి మధ్య దూతలుగా వ్యవహరించాలని సూచించారు. గౌరవ బిశ్వభూషణ్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నివారణకు ఎన్‌సిసి,ఎన్‌ఎస్‌ఎస్ బృందాల సహకారం తీసుకోవాలన్నారు. నిత్యం పెరుగుతున్న కరోనా కేసులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో విజయం సాధించడానికి మనమంతా కలిసి యుద్దప్రాతిపదికన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అత్యావశ్యకమన్నారు. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల నేపధ్యంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయిడు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8, ఏప్రిల్ 14న ముఖ్యమంత్రులతో సమీక్షించారని, ‘పరీక్షలు, ట్రేసింగ్, ట్రీట్మెంట్, ప్రవర్తనా నియమావళి అమలు, టీకా’ అనే ఐదు అంశాల వ్యూహాన్ని అమలు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారని గవర్నర్ గుర్తు చేసారు.