నీర‌వ్ మోదీ అప్ప‌గింత‌కు బ్రిట‌న్ గ్రీన్ సిగ్న‌ల్

 పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ స్కామ్ కేసులో నిందితుడు, డైమండ్ వ్యాపారి నీర‌వ్ మోదీని భార‌త్ కు అప్ప‌గించేందుకు బ్రిట‌న్ హోంమంత్రి ప్రీతి ప‌టేల్ ఆమోదం తెలిపారు. త‌న అప్ప‌గింత‌ను స‌వాల్ చేస్తూ బ్రిట‌న్ లో నీర‌వ్ మోదీ చేప‌ట్టిన న్యాయ‌పోరాటంలో ఫిబ్ర‌వ‌రి 25న ఆయ‌న‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. 

భార‌త్ లో స‌రైన ద‌ర్యాప్తు జ‌ర‌గ‌ద‌న్న‌ నీర‌వ్ వాద‌న‌ను త‌న 83 పేజీల ఉత్త‌ర్వుల్లో బ్రిట‌న్ వెస్ట్ మినిస్ట‌ర్ మేజిస్ట్రేట్స్ కోర్ట్ తోసిపుచ్చింది. మ‌రోవైపు క‌రోనా మ‌హ‌మ్మారితో నీర‌వ్ మోదీ మాన‌సిక ఆరోగ్యం బాగాలేద‌ని, భార‌త్ లో మాన‌వ హ‌క్క‌ల ఉల్లంఘ‌న‌ను సాకుగా చూపిన ఆయ‌న త‌ర‌పు అడ్వ‌కేట్ల వాద‌న‌నూ కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు.

ఇక నీర‌వ్ కు ఆర్ధ‌ర్ రోడ్డు జైలులో బ్యార‌క్ నెంబ‌ర్ 12లో అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని భార‌త్ హామీ ఇచ్చింద‌ని జ‌డ్జ్ గూజీ ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. కాగా, నీర‌వ్ మోదీని భార‌త్ కు అప్ప‌గించేందుకు బ్రిట‌న్ హోంమంత్రి ప్రీతి ప‌టేల్ ఆమోదముద్ర వేశార‌ని సీబీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.