య‌డ్యూర‌ప్పకు మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్‌

కర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్ య‌డ్యూర‌ప్పకు మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. గ‌త రెండు రోజుల నుంచి స్వ‌ల్పంగా జ్వ‌రం ఉండ‌టంతో వైద్యుల స‌ల‌హా మేర‌కు తాను ఇవాళ ఆస్ప‌త్రిలో చేరాన‌ని, ఆస్ప‌త్రిలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. 

అయితే, స్వ‌ల్పంగా జ్వ‌రం త‌ప్ప తాను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చినందున ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు, అధికారులు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. అంద‌రూ సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని సూచించారు.

అయితే, ఉద‌య‌మే బెంగ‌ళూరులోని రామయ్య ఆస్ప‌త్రిలో చేరిన ఆయ‌న‌కు పాజిటివ్ రావ‌డంతో మ‌ణిపాల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా, య‌డ్యూర‌ప్ప‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డం ఇది రెండోసారి. గ‌త ఏడాది ఫ‌స్ట్ వేవ్ సంద‌ర్భంగా కూడా ఆయ‌న‌కు, ఆయ‌న‌, కుమార్తె ప‌ద్మావ‌తి ఇద్ద‌రికీ క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ‌

పలువురు రాజకీయ ప్రముఖులు సహితం కరోనా బారిన పడ్డారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి దిగ్విజ‌య్‌సింగ్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న ఢిల్లీలోని త‌న నివాసంలో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. 

 కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా, శిరోమణి అకాలీదళ్‌ పార్టీ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ మేరకు ఇద్దరు నేతలు శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.