సెకండ్‌ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే

కరోనా రెండో దశ ఉప్పెనను అధిగమించడం పెద్ద సవాలేనని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. శుక్రవారం ఆయన దేశ రాజధాని ఢిల్లీలో ఎయిమ్స్‌లో ట్రామాసెంటర్‌ కేర్‌ సెంటర్‌ను సందర్శించి, ఆరోగ్య సౌకర్యాలపై ఆరా తీశారు. 

ఆయన వెంట ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో కరోనాపై నిర్లక్ష్యం పెరుగుతోందని పేర్కొన్నారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని, అందుకే ఆసుపత్రుల్లో పడకల సంఖ్య సైతం వేగంగా నిండుతోందని చెప్పారు.

వ్యవస్థను మెరుగుపరిచేందుకు సిద్ధంగా ఉన్నామని, నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. వైద్యులనుద్దేశించి మాట్లాడుతూ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వానికి ఏడాది అనుభవం ఉందని, అందువల్ల కరోనాకు వ్యతిరేకంగా యుద్ధానికి గతంలో కంటే సిద్ధంగా ఉన్నారని భరోసా వ్యక్తం చేశారు.

అన్ని పద్ధతులు, మార్గదర్శకాలు తెలుసునని, ప్రస్తుత ఉపెనను ఎదుర్కొవడం సవాల్‌ అని పేర్కొన్నారు. దవాఖానల్లో రోగులు, బంధువులకు సానుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యవస్థను మెరుగుపరిచేందుకు సిద్ధంగా ఉన్నామని, నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. 

 కాగా, డాక్టర్ హర్షవర్ధన్ శనివారంనాడు అన్ని రాష్ట్రాల హోం మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆసుపత్రుల్లో సౌకర్యాల పెంపునకు సంబంధించి దేశంలోని ఎయిమ్స్ ఆసుపత్రులతో వచ్చే సోమవారంనాడు వర్చువల్ మీట్ నిర్వహించనున్నారు.

తాజా గణాంకాల ప్రకారం, దేశంలోని 54 జిల్లాల నుంచి గత ఏడు రోజులుగా ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదని, అలాగే 44 జిల్లాల నుంచి గత 28 రోజులుగా ఎలాంటి కరోనా కేసులు నమోదవలేదని చెప్పారు. ఎయిమ్స్ ట్రౌమా సెంటర్‌లో 70 అదనపు పడకలు, ఝజ్జర్‌లోని నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో మరో 100 పడకలు ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించామని, కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

రెమ్‌డెసివిర్ డ్రగ్‌ను బ్లాక్‌మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెమ్‌డెసివర్ ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను ఆదేశించామని చెప్పారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 1,185 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరగా.. 1,25,47,866 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 1,74,308 మంది ప్రాణాలు కోల్పోయారు.