ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్ లో సరితకు స్వర్ణం 

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సరిత మోర్‌ స్వర్ణ పతకం గెల్చింది. గురువారం జరిగిన మహిళల రెజ్లింగ్‌ 59కిలోల విభాగం ఫైనల్లో సరిత మంగోలియకు చెందిన షువ్‌దార్‌ను చిత్తుచేసింది. 

న్యూఢిల్లీలో జరిగిన 2020 ఛాంపియన్‌ అయిన సరిత తొలుత 1-7 పాయింట్లతో వెనుకబడ్డా.. ఆ తర్వాత వరుసగా 9 పాయింట్లు గెల్చి స్వర్ణ పతకం నెగ్గడం విశేషం. సెమీఫైనల్‌ సరిత కజకిస్తాన్‌కు చెందిన డైనా కైమోవాను, తొలిరౌండ్‌ పోటీలో మంగోలియాకు చెందిన సువ్దోర్‌ను 5-4పాయింట్లతో ఓడించి ఫైనల్లోకి దూసుకొచ్చింది. 

50కిలోల విభాగంలో సీమ బిస్లా, 76కిలోల విభాగంలో పూజ సెమీఫైనల్స్‌లో ఓడి కాంస్యాలకే పరిమితమయ్యారు. సీమ తొలిమ్యాచ్‌ను కజకిస్తాన్‌కు చెందిన వలెంటినా చేతిలో ఓడినా.. ఆ తర్వాత మంగోలియాకు చెందిన అనుదారిని 2-0తో ఓడించి సెమీస్‌కు చేరింది. 

సెమీస్‌లో 2-3తో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జస్మినా చేతిలో పోరాడి ఓడింది. ఇక పూజ తొలి మ్యాచ్‌ను 2-0తో కొరియాకు చెందిన జంగ్‌ను ఓడించి, సెమీస్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఒజోడా చేతిలో పరాజయాన్ని చవిచూసింది.