‌ మర్కజ్‌ వద్ద ప్రార్థనలకు అనుమతించవద్దు 

‌ మర్కజ్‌ వద్ద ప్రార్థనలకు అనుమతించవద్దు 
దేశరాజధానిలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ వద్ద ప్రార్థనలకు అనుమతించవద్దని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. మర్కజ్‌ వద్ద ప్రార్థనలకు భక్తులను అనుమతించాలని సోమవారం తెలిపిన కేంద్రం, మంగళవారం మాత్రం కేవలం ఢిల్లీ వరకూ రూపొందించిన నూతన విపత్తు నిర్వహణ నియమాల ప్రకారం మర్కజ్‌లో ప్రార్థనలకు అనుమతించవద్దని విజ్ఞప్తి చేసింది
.
రంజాన్‌ మాసం సందర్భంగా మర్కజ్‌లో ప్రార్థనలకు అనుమతించాలని ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ వక్ఫ్‌ బోర్డు పిటీషన్‌ వేసింది. విచారణ సందర్భంగా సోమవారం ‘పోలీసులు ధ్రువీకరించిన 200 మంది వ్యక్తుల జాబితా నుంచి ఒకేసారి 20 మందిని మర్కజ్‌లో ప్రార్థనలకు అనుమతించవచ్చనని’ కోర్టుకు కేంద్రం తెలిపింది. దీనిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
‘మీ నోటిఫికేషన్‌లో, మతపరమైన ప్రదేశాల్లో సమూహాలను 20 మందికి తగ్గించారు’ అని తెలిపింది. ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌లో మహకుంభ్‌మేళాలో కోవిడ్‌ నిమయాలను పాటించకుండా ప్రజలు భారీగా పాల్గనడాన్ని ప్రశ్నించింది. ఇతర ప్రార్థనా స్థలాలకు లేనప్పుడు మసీదుకు మాత్రం సందర్శకుల సంఖ్యపై పరిమితి విధించడం అవసరం లేదని స్పష్టం చేసింది.
 
‘200 మంది వ్యక్తుల జాబితా ఆమోదయోగ్యం కాదు, అది చేయకూడదు’ అని మొట్టికాయలు వేసింది. అన్ని మత, రాజకీయ, విద్య, సామాజిక, క్రీడా సమావేశాలపై నిషేధాలపై నూతన విధానాలతో అఫిడవిట్‌ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో మంగళవారం అన్ని మతాల సమావేశాలను నిలిపివేసే విధంగా నూతన విపత్తు నిర్వహణ నియమాలను కోర్టుకు అందజేసింది. ఈ నియమాలు ఢిల్లీకే వర్తిస్తాయని స్పష్టం చేసింది.