రంజాన్ ప్రార్థనలకు బోంబే హైకోర్టు నో

రంజాన్ సామూహిక ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ ముంబైలోని ఓ మసీదు ట్రస్టు వేసిన పిటిషన్‌ను బోంబే హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం కొవిడ్-19 ఉధృతి తీవ్ర స్థాయిలో ఉన్నందున సామూహిక ప్రార్థనలకు అనుమతించడం కుదరదని తేల్చిచెప్పింది. 

మత విశ్వాసాన్ని అనుసరించే హక్కు ముఖ్యమే అయినప్పటికీ… పౌరుల సంక్షేమం అంతకంటే ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. రంజాన్ మాసం దృష్ట్యా తమ మసీదులో రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలకు అనుమతి ఇవ్వాలంటూ దక్షిణ ముంబైలోని జుమా మసీదు ట్రస్ట్ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్‌డీ ధనుక, జస్టిస్ వీజీ బిష్త్‌లతో కూడిన ధర్మాసనం… కరోనా వైరస్ వ్యాప్తి గొలుసును ఛేదించేందుకు ఆంక్షలు అత్యావశ్యకమని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది. 

‘‘ మత విశ్వాసాలు అనుసరిస్తూ, వేడుకలను జరుపుకునే హక్కు ముఖ్యమైనదే అయినప్పటికీ.. ప్రజా భద్రత, పౌరుల సంక్షేమం అంతకంటే ముఖ్యమైన, సర్వోన్నతమైనదని గమనించాలి…’’ అని కోర్టు పేర్కంది.