2 గంటలు కంటే తక్కువ ప్రయాణించే విమానాల్లో ‘మీల్స్’ బంద్

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో 2 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం ప్రయాణించే అన్ని దేశీయ (డొమెస్టిక్) విమానాల్లో భోజనంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. 

సోమవారం ఒక్కరోజే దేశంలో తొలిసారి రికార్డు స్థాయిలో సుమారు 1.70 లక్షల కోవిడ్ కేసులు (1.68,912) నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్లయిట్ మీల్స్‌పై నిషేధంతో పాటు ముందుగానే ప్యాక్ చేసిన స్నాక్స్, మీల్స్, పానీయాలను మాత్రమే సరఫరా చేయాలని కూడా మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది.

మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం, బిజినెస్, ఎకానమీ క్లాసులలో ట్రేలు, ప్లేట్లు, కట్లరీ తప్పనిసరిగా పూర్తి డిస్పోజబుల్స్ అయి ఉండాలి. రొటేటబుల్స్‌ను పునర్వినియోగానికి ముందుగా తప్పనిసరిగా శుభ్రం చేయాలి.

టీ, కాఫీ, ఆల్కహాలిక్, నాల్-ఆల్కహాలిక్ పానీయాలను ఒక్కసారి మాత్రమే వినియోగించే (డిస్పోజబుల్) క్యాన్లు, కంటైనర్లు, బాటిళ్లు, గ్లాసుల్లో సరఫరా చేయాలి. వినియోగించిన డిస్పోజబుల్, రొటేటబుల్ ట్రేలు, ప్లేట్లు, కట్లెరీలను విమాన సిబ్బంది డిస్పోజ్ చేయాలి. భోజనం, పానీయాలు సరఫరా చేసిన ప్రతిసారి చేతులకు కొత్త గ్లౌజ్‌లు వేసుకోవాలి.

కాగా, వేసవి షెడ్యూల్ కింద మార్చి చివరి ఆదివారం ప్రారంభించి అక్టోబర్ చివరి ఆదివారం వరకూ 108 విమానాశ్రయాల నుంచి ప్రతివారం 18,843 విమానాలు నడిపేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇటీవల ఆమోదించింది. గత ఏడాది కరోనా విజృంభణతో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల పాటు నిలిపివేసిన దేశీయ విమానాలను అదే ఏడాది మే 25న తిరిగి ప్రారంభించారు. కాగా, సెకెండ్ వేవ్ దృష్ట్యా అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మాత్రం ఏప్రిల్ 30 వరకూ పొడిగించారు.