బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజెపి, టిఎంసి అగ్రనేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆదివారం బసీర్‌హత్ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో హోంమంత్రి అమిత్‌షా ప్రసంగిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మే 2న రాజీనామాకు సిద్ధం కావాలంటూ మమతకు సవాల్ విసిరారు.
దీదీ పదేపదే తనను రాజీనామా చేయమంటున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆశిస్తే తన పదవికి రాజీనామా రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమిత్ షా ప్రకటించారు. ‘‘నేను రాజీనామా చేయాలని దీదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆదేశిస్తే రాజీనామా పత్రాలు వెంటనే సమర్పిస్తా. శిరస్సు వంచి పదవి నుంచి తప్పుకుంటా. మే 2న మమతా బెనర్జీ కచ్చితంగా గద్దె దిగాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో బిజెపి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ మమతను రాజీనామాకు సిద్ధం కావాలని అమిత్‌షా అన్నారు. కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాలని మమత పిలుపునిచ్చినందునే ప్రజలు దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మమతా బెనర్జీ రెచ్చగొట్టడం వల్ల ప్రజలు సీఐఎస్‌ఎఫ్ జవాన్లపై దాడికి దిగారని, ఆత్మరక్షణ కోసం జవాన్లు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు.
కూచ్‌బెహార్ జిల్లాలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ఆనంద బర్మన్ అనే బీజేపీ కార్యకర్త చనిపోయాడని అన్నారు. అతడి మృతి పట్ల మమత సంతాపం తెలపడం లేదని తప్పుపట్టారు. అతడు తృణమూల్ కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రాజ్‌బోంగ్‌శీ వర్గానికి చెందినవాడు కావడమే ఇందుకు కారణమని అమిత్ షా పేర్కొన్నారు.
బెంగాల్‌లోకి అక్రమంగా వలస వచ్చిన వారిని బుజ్జగించేందుకు దీదీ ప్రయత్నిస్తున్నారని, అందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. అక్రమ వలసదారులు ఒకవైపు ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందుతూ మరోవైపు సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులకు వత్తాసు పలుకుతున్నవారికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని కేంద్ర హోమ్ మంత్రి స్పష్టం చేశారు.
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే అక్రమ వలసలను అరికడతామని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీలో గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటామని వెల్లడించారు. ‘ముఖ్యమంత్రి కాందీశీకుల సంక్షేమ నిధి’ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాందీశీకులకు ఒక్కొక్కరికి ప్రతిఏటా రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు.
శాంతిపూర్, రాగాఘాట్ దక్షిణ నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ర్యాలీలను అమిత్‌షా నిర్వహించారు. సిలిగురిలో ఆదివారం మీడయాతో మాట్లాడిన మమత, కేంద్ర బలగాలపై మరోసారి ఆరోపణలు చేశారు. జనం గుండెలకు గురిపెట్టి కాల్పులు జరిపారని ఆమె విమర్శించారు. గుంపుల్ని చెదరగొట్టాలనుకుంటే కాళ్లమీద కాల్పులు జరపాలన్న అనుభవం కూడా లేదని ఆమె పేర్కొన్నారు.
More Stories
సైఫ్ అలీ ఖాన్పై దాడిలో అండర్వరల్డ్ హస్తం లేదు!
31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500