ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘ చాలక్ మోహన్‌ భాగవత్ కు కరోనా

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌.ఎస్‌.ఎస్‌) సర్ సంఘ చాలక్ మోహన్‌ భగవత్‌ కరోనా పాజిటివ్‌గా పరీక్ష చేశారు. ఈ మేరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ట్వీట్‌ చేసింది. సాధారణ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలినట్లు పేర్కింది. దీంతో ఆయన నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే హాస్పిటల్‌లో చేరారు. 

ఆయనకు సాధారణ పరీక్షలు చేశారని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘ చాలక్ భాగవత్ మార్చి 7న కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్‌ తీసుకున్నారు. 

కాగా, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) నేత ఒమర్‌ అబ్దుల్లాకు కరోనా సోకింది. తనకు పాజిటివ్‌గా రిపోర్టు వచ్చినట్లు శుక్రవారం ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అయితే ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు.

 ‘ఒక సంవత్సరం పాటు ఈ హేయమైన వైరస్‌ను ఓడించటానికి నేను నా వంతు ప్రయత్నం చేశాను. కాని, చివరకు అది నాకు సోకింది. కరోనా పాజిటివ్‌గా ఈ మధ్యాహ్నం నిర్ధారణ అయ్యింది. నాలో ఎలాంటి లక్షణాలు లేవు. వైద్యుల సలహా మేరకు హోమ్‌ ఇసొలేషన్‌లో ఉన్నాను. ఆక్సిజన్ స్థాయిలు వంటివి పర్యవేక్షిస్తున్నాను’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. కాగా, ఆయన రెండు రోజుల కిందట కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కొవిడ్‌ హాస్పిటల్‌లో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగి నలుగురు మృత్యువాతపడ్డారు. అదే సమయంలో హాస్పిటల్‌లో ఉన్న 27 మంది రోగులను మరో దవాఖానకు తరలించినట్లు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. 

నాగ్‌పూర్‌ వాడి పరిసరాల్లోని ప్రైవేటు ఆసుపత్రిలో 30 పడకలు ఉండగా.. 15 ఐసీయూ పడకలు ఉన్నాయి. దవాఖాన రెండో అంతస్థులో ఐసీయూ ఏసీ యూనిట్‌ నుంచి మంటలు మొదలయ్యాయి. తర్వాత వార్డు మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే మంటలు రెండో అంతస్తుకే పరిమితమయ్యాయి.

మిగతా అంతస్తులకు వ్యాపించకపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని నాగ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రాజేంద్ర ఉచ్కే పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పినట్లు చెప్పారు. దవాఖానలో కొవిడ్‌ రోజులకు చికిత్స అందిస్తున్నారు. 

ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌ కలెక్టర్‌తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.