ఈసీ నోటీసుల పట్ల మమతా ధిక్కార ధోరణి 

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలసంఘానికి (ఈసీ), ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేతి మమత బెనర్జీకి వివాదం ముదురుతున్నది. కేంద్ర సాయుధ దళాలపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మమతకు ఈసీ గురువారం రాత్రి నోటీసులు పంపింది. 

సీఆర్పీఎఫ్‌ వంటి కేంద్ర సాయుధ దళాలపై మమత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రెచ్చగొట్టేలా ఉన్నాయని, అవన్నీ అవాస్తవమని ఈసీ నోటీసుల్లో పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలతో ఆమె ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, ఎన్నికల కోడ్‌ నియమాలను ఉల్లంఘించారని తెలిపింది. శనివారం ఉదయం 11 గంటలలోగా నోటీసులకు సమాధానం తెలియజేయాలని ఆదేశించింది. 

అయితే ఈసీ నోటీసులపై మమతా ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నారు.  ఇలాంటి నోటీసులను తాను లెక్కచేయబోనని తేల్చి చెప్పారు. సీఆర్పీఎఫ్‌ బలగాలు బీజేపీకి అనుకూలంగా పనిచేయడం మానేంత వరకు తాను ఇలాంటి వ్యాఖ్యలే చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ పనిచేస్తున్నదని పునరుద్ఘాటించారు. పోలింగ్‌ రోజున ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేసినా నియమావళి ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు.

‘ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలను తన వ్యాఖ్యల ద్వారా అసత్యపూరితమైన వ్యాఖ్యలతో, రెచ్చగొట్టేలా, విచక్షణ రహితంగా మమత దూషించారనేందుకు, అవమానించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలతో వారిలో నైతికస్థైర్యం దెబ్బతింటుంది’ అని ఈసీ పేర్కొంది.

1980ల నుంచి ఎన్నికల్లో కేంద్ర బలగాలు విలువైన సేవ చేస్తున్నాయని గుర్తు చేసింది. ఈసీ నోటీసుపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. సీఆర్‌పీఎఫ్‌పై తన ఆరోపణలను ఆమె మరోసారి పునరుద్ఘాటించారు. ‘బీజేపీ కోసం పనిచేయడం ఆపి వేయనంత వరకు సీఆర్‌పీఎఫ్‌ తప్పులపై మాట్లాడుతూనే ఉంటాను. వారు ఆ పని ఆపేస్తే వారికి సెల్యూట్‌ చేస్తాను’ అని స్పష్టం చేశారు.

దాదాపు వారం వ్యవధిలో మమతకు ఈసీ నోటీసులు జారీ చేయడం ఇది రెండో సారి. ముస్లింలను మతపరంగా ఓట్లను అభ్యర్థిస్తున్నారన్న బీజేపీ ఫిర్యాదుపై ఇప్పటికే ఆమెకు ఈసీ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, బీజేపీకే ఓటేయాలని ఓటర్లను,ముఖ్యంగా మహిళలను బెదిరిస్తున్నాయని గత కొన్ని రోజులుగా మమత ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

మరోవంక, పశ్చిమబెంగాల్‌లో నాలుగో విడుత ఎన్నికల్లో భాగంగా శనివారం 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనున్నది. కేంద్ర మంత్రి బాబూల్‌ సుప్రియో, బెంగాల్‌ మంత్రులు పార్థా బెనర్జీ, అరూప్‌ బిశ్వాస్‌ తదితర ప్రముఖులు ఈ విడుత బరిలో ఉన్నారు. పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో దాదాపు 789 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించింది.