అగ్రరాజ్యం అమెరికాకు చెందిన యూఎస్ నేవీ 7వ ఫ్లీట్ భారత్ అనుమతి లేకుండానే మన దేశ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఆపరేషన్ నిర్వహించింది. ఈ విషయాన్ని యూఎస్ నేవీయే ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఒక దేశ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్లో మిలిటరీ కసరత్తులు నిర్వహించే ముందు ఆ దేశ అనుమతి తీసుకోవాలి. కానీ యూఎస్ నేవీ మాత్రం ఈ నెల 7వ తేదీన లక్షద్వీప్‌కు 130 నాటికల్ మైళ్ల దూరంలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్లు నిర్వహించింది.
అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తాము ఈ కసరత్తులు నిర్వహించామని, భారత్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని ఆ ప్రకటనలో యూఎస్ నేవీ 7వ ఫ్లీట్ తెలిపింది.
భారత్‌కు సన్నిహితంగా ఉండే వ్యూహాత్మక భాగస్వాముల్లో ఒకటైన అమెరికా చేసిన ఈ పని ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. గతంలోనూ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్లను తాము చేపట్టామని, భవిష్యత్తులోనూ ఇలాగే చేపడతామని అదే ప్రకటనలో యూఎస్ నేవీ చెప్పడం గమనార్హం.
ఈ ప్రకటనపై భారత నేవీగానీ, విదేశాంగ శాఖగానీ స్పందించలేదు. క్వాడ్ గ్రూపులో భాగంగా ఉన్న భారత్, అమెరికా ఈ మధ్యే జరిగిన సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారానికి అంగీకరించాయి. ఇందులో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్‌కు మద్దతు తెలపడం కూడా ఒకటి.

More Stories
నేపాల్‌లో మళ్లీ జెన్ జెడ్ నిరసనలు.. కర్ఫ్యూ!
ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫెల్ పై చైనా అసత్య ప్రచారం
భారత్‌లో భారీ దాడులకు జైషే విరాళాల సేకరణ