సుప్రీంకోర్టులోనూ అనిల్ దేశ్‌ముఖ్‌కు షాక్‌

మ‌హారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ విష‌యంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న దేశ్‌ముఖ్‌తోపాటు ఆరోప‌ణ‌లు చేసిన ముంబై మాజీ క‌మిష‌న‌ర్ ప‌ర‌మ్ బీర్ సింగ్‌పైనా విచార‌ణ జ‌ర‌గాల్సిందేన‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. త‌న‌పై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌న్న బాంబే హైకోర్టు ఆదేశాల‌ను స‌వాలు చేస్తూ అనిల్ దేశ్‌ముఖ్ సుప్రీంకోర్టుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న‌తోపాటు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను అత్యున్న‌త న్యాయస్థానం కొట్టేసింది.

విచారణ సంద‌ర్భంగా జ‌స్టిస్ కౌల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఆరోప‌ణ‌లు చేసింది మీ శ‌త్రువు కాదు. మీ కుడి భుజంగా భావించే వ్య‌క్తి (ప‌ర‌మ్ బీర్ సింగ్‌) చేశారు. అందుకే ఇద్ద‌రిపైనా విచార‌ణ జ‌ర‌గాల్సిందే అని జ‌స్టిస్ కౌల్ స్ప‌ష్టం చేశారు. మహారాష్ట్ర‌కు చెందిన ఉన్న‌త స్థాయి అధికారుల పాత్ర ఇందులో ఉన్న‌ద‌ని ఆయ‌న తెలిపారు.

అనిల్ దేశ్‌ముఖ్ త‌ర‌ఫున వాదించిన న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ దీనికి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. చ‌ట్టం అంద‌రికీ ఒకేలా వ‌ర్తింప‌జేయాల‌ని ఆయ‌న కోరారు. పోలీస్ క‌మిష‌నర్ చేసిన ఆరోప‌ణే సాక్ష్యం కాదు క‌దా అని ఆయ‌న వాదించారు. దేశ్‌ముఖ్ వాద‌న విన‌కుండా ప్రాథ‌మిక విచార‌ణ జ‌ర‌గ‌కూడ‌ద‌ని సిబ‌ల్ పేర్కొన్నారు.

అయితే సిబ‌ల్ వాద‌న‌ల‌తో సుప్రీంకోర్టు ఏకీభ‌వించ‌లేదు. ఆరోప‌ణ‌లు చాలా తీవ్ర‌మైన‌వి. హోంమంత్రి, పోలీస్ క‌మిష‌న‌ర్‌ల పాత్ర ఇందులో ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య సంబంధాలు చెడే వ‌రకూ ఇద్ద‌రూ చాలా స‌న్నిహితంగా క‌లిసి ప‌ని చేశారు. దీనిపై సీబీఐ విచార‌ణ జ‌ర‌ప‌కూడ‌దా? ఆరోప‌ణ‌ల తీవ్ర‌త‌, ఇందులో ఉన్న వ్య‌క్తుల‌ను చూస్తే స్వ‌తంత్ర విచార‌ణ జ‌ర‌గాల్సిందే అని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కౌల్ స్ప‌ష్టం చేశారు.