కరోనా విషయంలో ఉద్ధవ్ సర్కార్ నిర్లక్ష్యం

కరోనా విషయంలో ఉద్ధవ్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని  కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆరోపించారు. దేశం కరోనాపై భీకర పోరు చేస్తోందని, మహారాష్ట్ర సర్కార్ వ్యవహారంతో అది కాస్త నీరుగారిపోతోందని ధ్వజమెత్తారు. కరోనా వారియర్స్‌కు టీకాలు వేసే విషయంలో మహారాష్ట్ర సర్కార్ పనితీరు ఏమాత్రం గొప్పగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం నియమ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహించి, ప్రజలను సంకట స్థితిలోకి నెట్టేశారని తీవ్రంగా మండిపడ్డారు.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి, భయాందోళనలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ మహారాష్ట్ర సర్కార్‌ పై పరోక్షంగా హర్షవర్ధన్ విరుచుకుపడ్డారు.  దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఏమాత్రం లేదని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాలు కోరిన సంఖ్యలో తాము కరోనా వ్యాక్సిన్లను పంపిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.

వారి వారి అవసరాల తగ్గట్టుగానే పంపిస్తున్నామని, ఏ రాష్ట్రానికీ వ్యాక్సిన్ కొరత రానివ్వమని తెలిపారు. ఈ విషయాన్ని తాము ఇప్పటికే అన్ని రాష్ట్రాలకూ స్పష్టం చేశామని, రాష్ట్రాలకు వ్యాక్సిన్ కొరత తలెత్తకుండా చూసుకుంటామని హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. 

 కాగా, కరోనా టీకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం తగదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ హితవు పలికారు. అవసరమైన సంఖ్యలో టీకాలను కేంద్రం సరఫరా చేయడం లేదన్న మహారాష్ట్ర ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ రోజు వరకు ఆ రాష్ట్రానికి 1,06,19,190 వ్యాక్సిన్లు సరఫరా చేసినట్లు తెలిపారు.

 ఇందులో 90,53,523 టీకాలు వినియోగం కాగా 6 శాతం మేర సుమారు ఐదు లక్షలకుపైగా టీకాలు వృథా అయ్యాయని చెప్పారు. మరో 7,43,280 టీకాలు పైప్‌లైన్‌లో ఉన్నాయని, దీంతో దాదాపు 23 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వాస్తవ వినియోగానికి అవసరమైన దానికంటే ఎక్కువ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని ప్రకాశ్‌ జవదేకర్ వెల్లడించారు.

మహారాష్ట్ర  రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే  బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో వ్యాక్సిన్లు అయిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం 14 లక్షల వ్యాక్సిన్ మోతాదులు ఉన్నాయని, ఇవి రాబోయే మూడు రోజులకు సరిపోతాయని చెప్పడం పట్ల కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.