12 నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత

కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తుండటంతో అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. పాఠశాలలు, పార్కులు, బీచ్‌లు, మాల్స్‌ను మూసివేశారు. భారీగా భక్తుల రద్దీ ఉండే దేవాలయాలపైనా ఈ ప్రభావం పడింది.

ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా నెగిటివ్‌ (ఆర్టీ-పీసీఆర్‌) రిపోర్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

తాజాగా ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 12 నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 వరకే సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. సోమవారం నుంచి సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తామని ప్రకటించింది.

రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరింది. ఆలయానికి వచ్చే భక్తులు విధిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.  సోమవారం నుంచి జారీని నిలిపివేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. తదుపరి టోకెన్లు జారీ ఎప్పుడనేది ముందుగానే తెలియజేస్తామని తెలిపింది.