మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు.  రాజీనామా లేఖ‌ను ఆయ‌న సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు అంద‌జేశారు. అయితే ఆ రాజీనామా లేఖ‌ను సీఎం ఆమోదించాల్సి ఉంద‌ని మ‌రో మంత్రి న‌వాబ్ మాలిక్ తెలిపారు. 
 
హోంమంత్రిపై తాను ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రేకు ఫిర్యాదు చేసిన కార‌ణంగానే త‌న‌ను బ‌దిలీ చేశార‌ని ప‌ర‌మ్ బీర్ ఆరోపించారు. పోలీసు అధికారుల‌కు నెల‌కు రూ.100 కోట్ల వ‌సూళ్ల ల‌క్ష్యం విధించార‌ని, అక్ర‌మ బదిలీలు చేశార‌ని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ప‌ర‌మ్ బీర్ ఆరోప‌ణ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే.
 
గ‌త విచార‌ణ‌లో ఈ ఆరోప‌ణ‌ల‌పై ఎందుకు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేదంటూ బాంబే హైకోర్టు ఆయ‌న‌ను ప‌దే ప‌దే ప్ర‌శ్నించింది. కేసులో హోంమంత్రి, ముఖ్య‌మంత్రి ఉన్నార‌ని చ‌ట్టాల‌ను ప‌క్క‌న పెడ‌తారా అని ప్ర‌శ్నించారు. ప‌రంబీర్ ఆరోప‌ణ‌ల‌పై ఇక సీబీఐ విచార‌ణ చేప‌డుతుంద‌ని, ఇక ఇప్పుడు ఆయ‌న మంత్రి ప‌ద‌విలో ఉండ‌డం స‌రికాదు అని ఎన్సీపీకి చెందిన నేత ఒక‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. 
 
కోర్టు ఆదేశాల‌పై తాను ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌ద‌లుచుకోలేద‌ని ప‌రంబీర్ సింగ్ తెలిపారు.. దేశ్‌ముఖ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర్టు సీబీఐ విచారణను కోరిన నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రేకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా అనంతరం ప్రభుత్వాన్ని నడిపే నైతిక బాధ్యతను ఉద్ధవ్‌ ఠాక్రే కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఠాక్రే కుట్రపూరితంగా మౌనం దాల్చారని ఆరోపించారు.
ఇలా ఉండగా, మహారాష్ట్ర నూతన హోంమంత్రిగా దిలీప్ పాటిల్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. హోంమంత్రిగా అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో దిలీప్ పాటిల్ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. దిలీప్ వాల్సే పాటిల్ ఎన్సీపీలో సీనియర్ నాయకుడు. ఆయనకు శాసనలో సభలో అపార అనుభవం ఉంది. ఈయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. తాలూకా స్థాయి నుంచి రాజకీయాలను ప్రారంభించారు.