
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు ఆదివారం తిరిగి భాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం గొల్లపల్లి వంశం నుంచి ప్రధాన అర్చకులుగా వేణుగోపాల్ దీక్షితులు కొనసాగుతున్నారు. అయితే వేణుగోపాల్ దీక్షితులు పర్మినెంట్ ఉద్యోగి కావడంతో అధికార బదలాయింపులో ఎలాంటి మార్పులు వుండవని ఆలయ అధికారులు చెబుతున్నారు.
టీటీడీలో మూడేళ్ల కిందట రిటైరయిన అర్చకులు తిరిగి విధుల్లో చేరవచ్చంటూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండున్నరేళ్ల కిందట హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇప్పుడు గుర్తుచేసుకుని శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ప్రధానార్చకుడిగా ఏవీ రమణదీక్షితులు తిరిగి విధుల్లో చేరారు.
కాగా 65ఏళ్లు దాటిన అర్చకులకు పదవీ విరమణ వర్తింపజేయాలని 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 65ఏళ్లు నిండిన అర్చకులందరినీ రిటైర్ చేశారు.
ఈ నిర్ణయంతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులతో పాటు మూడు ఆలయాల నుంచి 10మంది మిరాశీ వంశీకులు, నాన్‌మిరాశీ (కైంకర్యపరులు) అర్చకులు మరో 10 మంది విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వీరి స్థానంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా పైడిపల్లి వంశం నుంచి ఏఎస్ కృష్ణ శేషాచల దీక్షితులు, గొల్లపల్లి వేణుగోపాల దీక్షితులు, పెద్దింటి శ్రీనివాసదీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందాచార్యులను నియమించారు.
కాగా, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈనెల 14 నుంచి భక్తులను అనుమతించే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు టీటీడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇలా ఉండగా, ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలను టీటీడీ దత్తత తీసుకుని వాటి ద్వారా వచ్చే ఆదాయన్ని దూపదీపనైవేద్యాలకు కేటాయించాలని బ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సూచించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘునందన్ రావు శ్రీవారి హుండీ ఆదాయాన్ని ధర్మప్రచారానికి కనీసం 10 శాతం కూడా కేటాయించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
More Stories
భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్ర మోదీనే!
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం