స‌న్యాసం స్వీక‌రించిన మాజీ ఎమ్మెల్యే

ఏకంగా ఐదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కొనసాగిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు సన్యాసం స్వీకరించాడు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ శివరామకృష్ణారావు రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద శాస్త్రోక్తంగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు. దాంతో ఇకపై ఆయన స్వామి శివరామానంద సరస్వతిగా కొనసాగనున్నారు.

శివరామకృష్ణారావు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. దివంగత‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సన్నిహితుడిగా ఆయన క్రియాశీల రాజకీయాల్లో కొనసాగారు. తొలిసారి 1972లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 1977లో బద్వేలు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1983, 1985 ఎన్నికల్లో ఓడినా, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున‌ పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2001 ఎన్నికల్లో ఆయ‌న ఓటమి చ‌విచూశారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఆయ‌న‌ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

శివరామకృష్ణారావుతోపాటు అప్పట్లో పులివెందుల నుంచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మైదుకూరు నుంచి డీఎల్‌ రవీంద్రారెడ్డిలు 1972లో తొలిసారి గెలుపొందారు. ముగ్గురు వైద్యులు కావడం, యువకులుగా అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. నాటి ముఖ్యమంత్రి అంజయ్య కేబినెట్‌లో మంత్రి పదవి అవకాశం వచ్చినా తన మిత్రుడైన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కోసం త్యాగం చేసి వైఎస్‌కు అత్యంత సన్నిహితునిగా గుర్తింపు పొందారు.

2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్ప‌టికీ 2015 నుంచే ఆధ్యాత్మిక చింతనవైపు మొగ్గుచూపి మానస సరోవర్, చార్‌ధామ్‌, అమర్‌నాథ్‌తోపాటు ప‌లు శక్తి పీఠాలను సందర్శించారు. రిషికేశ్‌కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికంలో కొనసాగుతున్నారు.