చంద్రబాబు, జగన్‌ ప్రధానులైనా హోదా రాదు

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదని మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపీ సుజనా చౌదరి తేల్చేశారు. చంద్రబాబు, జగన్  ప్రధానిగా ఉన్నా అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత హోదా ఇస్తామని బీజేపీ ఎన్నికల హామీ ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ నుంచి ఎదురవుతున్న విమర్శలను ఆయన కొట్టిపారవేసారు. 

ఈ విషయమై టీడీపీ, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు. ప్రత్యేక హోదాను టీడీపీ, వైసీపీ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఆర్ధికసంఘం ఎప్పుడో చెప్పిందని సుజనా గుర్తుచేశారు.

పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంత హోదా హామీకి ఏపీ ప్రత్యేక హోదా హామీకీ సంబంధం లేదని సుజనా స్పష్టం చేశారు. ఈ రెండూ వేర్వేరు అంశాలని సుజనా తెలిపారు. ఏపీకి ఇవ్వకుండా పుదుచ్చేరికి హోదా ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సుజనా ఈ స్పష్టత  ఇచ్చారు. పుదుచ్చేరికి ఇచ్చిన హామీపై సరిగ్గా చదువుకోవాలని ఆయన విమర్శకులకు సూచించారు.

పుదుచ్చేరిలో కేంద్ర పథకాల విషయంలో అదనపు సాయం చేస్తామని మాత్రమే దీని అర్ధమని సుజనా వివరించారు.‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడమనేది అవుట్‌ డేటెడ్‌ విషయం” అని తేల్చి చెప్పారు. హోదాద్వారా వచ్చే వాటికంటే ఎక్కువ నిధులు రాష్ట్రానికి అందుతున్నాయి. అలాంటప్పుడు హోదా ఎందుకు? అని ప్రశ్నించారు.  మోదీ ప్రభుత్వంలో రాష్ట్రానికి నిధులు పుష్కలంగా అందుతున్న నేపథ్యంలో హోదా అవసరం లేదని పేర్కొన్నారు.