ముఖేష్‌ ఇంటి ముందు వాహనం నిలిపింది వాజే డ్రైవర్‌

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనాన్ని నిలిపింది సచిన్‌ వాజే వ్యక్తిగత డ్రైవర్‌ అని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ తెలిపింది. అధికారుల దర్యాప్తు ప్రకారం ఫిబ్రవరి 17న స్కార్పియో వాహనంలో సమస్య తలెత్తిందన్న కారణంతో దానిని నడిపిన మన్‌సుఖ్‌ హిరేన్‌ ముంబైలోని ములుండ్-ఐరోలి రోడ్‌లో వదిలేశాడు. 

అదే రోజు సిటీ పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ వాహనం తాళాన్ని పోలీస్‌ అధికారి సచిన్‌ వాజేకు ఆయన కార్యాలయంలో అప్పగించాడు. అనంతరం వాజే సూచనతో అతడి వ్యక్తిగత డ్రైవర్‌ ఆ స్కార్పియో వాహనాన్ని నడిపి వాజే నివాసం ఉంటున్న సాకేత్‌ హౌసింగ్‌ సొసైటీ వద్ద పార్క్‌ చేశాడు.

ఫిబ్రవరి 19న వాజే డ్రైవర్‌ స్కార్పియోను పోలీస్ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చి పార్క్‌ చేశాడు. మరునాడు ఆ డ్రైవర్‌ దానిని తిరిగి సొసైటీ వద్దకు తీసుకువచ్చి పార్క్‌ చేశాడు. ఫిబ్రవరి 24 వరకు ఆ వాహనం వాజే నివాసం ఉన్నచోట ఉన్నది. ఆ రోజు రాత్రి వాజే డ్రైవర్‌ దానిని దక్షిణ ముంబైలో నడిపాడు. 

ముఖేష్ అంబానీ విలాసవంతమైన ‘అంటిలియా’ సమీపంలోని బయట ఫిబ్రవరి 25న పార్క్‌ చేశాడు. కాగా, స్కార్పియోను పోలీసులు అడ్డుకోకుండా ఉండేందుకు సచిన్‌ వాజే తెల్లని ఇన్నోవా కారులో దానిని ఫాలో అయ్యాడు. ఫిబ్రవరి 25న రాత్రి పది గంటలకు డ్రైవర్‌ స్కార్పియోను ముఖేష్ ఇంటి వద్ద పార్క్‌ చేసిన అనంతరం దాని నుంచి దిగి వాజే నడిపిన ఇన్నోవా కారులో వెళ్లిపోయాడు.

కాగా, ఆ ఇన్నోవా కారు మరోసారి మరో నంబర్‌ ప్లేట్‌తో ముఖేష్‌ అంబానీ ఇంటి వద్దకు వచ్చిందని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. ఆ రాత్రి పీపీఈ కిట్‌ ధరించిన సచిన్‌ వాజే, స్కార్పియో వద్దకు వెళ్లి అందులో బెదిరింపు లేఖను ఉంచినట్లు చెప్పారు. 

అనంతరం సచిన్‌ వాజే ఆధారాలు నాశనం చేసేందుకు ప్రయత్నించారని, పోలీస్‌ హెడ్‌ క్వాటర్స్‌, సాకేత్‌ సొసైటీకి చెందిన సీసీటీవీ డీవీఆర్‌లతోపాటు ఇతర వస్తువులను తన పనిమనిషితో మితి నదిలో పడవేయించినట్లు వివరించారు.

ముఖేష్‌ ఇంటి వద్ద బాంబులతో కూడిన వాహనం, మన్‌సుఖ్‌ హిరేన్‌ అనుమానాస్పద మృతి కేసులపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ ఈ రెండు కేసుల్లో ఆరోపణలున్న ముంబై పోలీస్‌ అధికారి సచిన్‌ వాజేను అరెస్ట్‌ చేసి ప్రశ్నిస్తున్నది. దర్యాప్తు నుంచి లభించిన సమాచారం ఆధారంగా హిరేన్ మృతదేహం లభించిన చోట మితి నదిలో ఇటీవల గజ ఈతగాళ్లతో గాలించగా రెండు డీవీఆర్‌లు, సీపీయూ, రెండు కారు నంబర్‌ ప్లేట్లతోపాటు మరికొన్ని వస్తువులు బయటపడ్డాయి.