వ్యవసాయం లాభసాటి అయ్యేందుకే సంస్కరణలు 

భారతీయ రైతుల స్థాయిని పెంచడంతోపాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో మరింత స్పష్టమైన ఫలితాలు సాధించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమన్వయంతో కృషిచేయల్సిన అవసరం ఉందని సూచించారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ కందా రచించిన ‘అగ్రికల్చర్ ఇన్ ఇండియా: కాంటెంపరరీ చాలెంజెస్-ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇంకం’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరిస్తూ పలు సమస్యల కారణంగా రైతులు తమ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ సమస్యలను ఇలాగే కొనసాగించడం సరికాదని చెప్పారు.

భూ కమతాల విస్తీర్ణం తగ్గడం, రుతుపవనాలపైనే ఆధారపడటం, నీటిపారుదల సౌకర్యాల లేమి, సరైన సమయానికి అవసరమైనంత రుణాలు అందకపోవడం మొదలైన సమస్యలే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వ్యవసాయం లాభసాటి కావాలంటే రైతులు ఖర్చును తగ్గించి, మంచి ఆదాయాన్ని అందించే ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

ప్రస్తుతం సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నదని, రైతులు వినియోగించుకుని లాభాలు పొందడానికి అవకాశం ఉన్నదని వెంకయ్యనాయుడు చెప్పారు. ఉత్పత్తి సమస్య, ధరల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రాధాన్యతను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి  రవాణా, నిల్వ, గిడ్డంగుల వంటి మౌలిక వసతులు, పంటల్లో వైవిధ్యత, పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ వంటి వాటిపై దృష్టిపెట్టాలని సూచించారు.

ఇటీవలి కాలంలో చదువుకున్న యువత వ్యవసాయం వైపు ఆకర్షితులై అద్భుతాలు సృష్టించడం ఆనందదాయకమని చెప్తూ  కరీంనగర్ జిల్లాకు చెందిన సంధ్య, మల్లికార్జున్ రెడ్డి వ్యవసాయం చేస్తున్న విషయాన్ని ప్రస్తావించి వారికి అభినందనలు తెలియజేశారు.