ఎన్నికల కమిషన్ స్వీయ నియంత్రణలో పని చేయాలి

ఎన్నికల కమిషన్ ఇతర వ్యవస్థలలో జోక్యం చేసుకోకూడదని, వాటికి గౌరవం ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నేడు పదవీ విరమణ చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇటువంటి వ్యవస్థలు స్వీయనియంత్రణలో పనిచేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. 

ఎన్నికల కమిషన్  ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, 243కె ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పించిందని పేర్కొంటూ వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు.  ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందనిసంతోషం వ్యక్తం చేశారు. 

ఎన్నికల నిర్వహణ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెబుతూ ఎన్నికల కమీషన్ కు గల విశేష అదిఆకారాలను ఎన్నికల నిర్వహణ వరకే ఉపయోగించుకున్నాం గాని ఇతర వ్యవస్థలలో జోక్యం చేసుకొనే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. రీపోల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుందని గుర్తు చేశారు. 

స్థానిక ఎన్నికల్లా కాకుండా సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించామని పేర్కొన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నుంచి పూర్తి సహకారం లభించిందని తెలిపారు. మీడియా ద్వారా సిఎస్‌కు, సహచర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని చెప్పారు. 

కొన్ని సందర్భాలలో వ్యవస్థల మధ్య అంతరాలు అనవసరంగా వచ్చాయని, ఎన్నికల సిబ్బందిని సెలవుల్లో వెల్లమన్నారని విచారం వ్యక్తం చేశారు. దీన్ని వెంటనే చక్కదిద్దామని పేర్కొన్నారు. 

కాగా, తన ఓటు తెలంగాణలో రద్దు చేసుకుని సొంత గ్రామంలో ఓటు అడిగానని, అది నిరాకరించడంవల్ల టీ కప్పులో తుఫానుగా మారిందని చెప్పారు. ఇప్పటికీ తన ఓటు హక్కు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందని చెబుతూ ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళతానని స్పష్టం చేశారు. 

స్థానిక సంస్థల ఎన్నికలలో వివిధ రాష్ట్రాలలో అనుసరిస్తున్న మంచి పద్దతులను పరిశీలన జరిపి, తన పరిధిలో ఎన్నికల నిర్వహణలో గడించిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలలో తీసుకు రావలసిన మార్పుల గురించి ఒక నివేదిక తయారు చేశానని, దానిని గవర్నర్ కు సమర్పిస్తానని వెల్లడించారు. ఈ నివేదికను అన్ని రాజకీయ పక్షాల పరిశీలనకు కూడా అందుబాటులో ఉంచుతానని చెప్పారు.