ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, జమ్మూకమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా మంగళవారంనాడు ఓ ట్వీట్‌లో ధ్రువీకరించారు. 

‘మా తండ్రిగారికి కోవిడ్-19 పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. కొన్ని లక్షణాలు కూడా కనిపించాయి. నాతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా పరీక్షల ఫలితాలు వచ్చేంతవరకూ హోం ఐసొలేషన్‌లోనే ఉంటున్నాం. ఇటీవల కాలంలో మమ్మల్ని కలిసేందుకు వచ్చిన వారు కూడా ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను’ అని ఆ ట్వీట్‌లో ఒమర్ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నప్పటికీ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాన్నాయి. కోవిడ్ సెకెండ్ వేవ్‌ను నిరోధించేందుకు పలు రాష్ట్రాలు ఆంక్షలు కూడా అమలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో ఒక్క మార్చి నెలలోనే అత్యధిక కరోనా కేసులు నమోదు కావడం కలవరం రేపింది.

ఈ ఏడాది మార్చి 1 నుంచి మార్చి 29వతేదీ వరకు మహారాష్ట్రలో 5,90,448 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది సెప్టెంబరు నెలలో అత్యధికంగా 5,93,192 కరోనా కేసులు బయటపడ్డాయి.మార్చి కంటే ముందు నాలుగు నెలల్లో గత ఏడాది నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు 4,87,519 కరోనా కేసులు వెలుగుచూశాయి.

గడిచిన 24 గంటల్లో 56,211 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,20,95,855కు పెరిగింది. వైరస్‌ ప్రభావంతో 24 గంటల్లో 271 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,62,114కు చేరింది. తాజాగా 27,028 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,13,93,021 మంది కోలుకున్నారు.

కొవిడ్‌ కేసుల పెరుగుదలతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకుంటున్నది.. వచ్చే 15 రోజుల పాటు రాష్ట్రంలో ర్యాలీలు, నిరసనలపై నిషేధం విధించింది. ఈ మేరకు సీఎం యడ్యూరప్ప ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌ పరిస్థితిపై ఆరోగ్యశాఖ అధికారులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.