ఉత్కంఠ పోరులో వన్డే సిరీస్ భారత్‌దే

సొంతగడ్డపై విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్‌పై టెస్టు, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా..వన్డే సిరీస్‌లోనూ అదే తరహాలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి 2-1తో సిరీస్‌ని చేజిక్కించుకుంది.
ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన కోహ్లీసేన 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌(95 నాటౌట్‌: 83 బంతుల్లో 9ఫోర్లు,3సిక్సర్లు) ఒంటరిగా పోరాడి ఇంగ్లాండ్‌ను గెలిపించినంత పనిచేశాడు.
 ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్‌ విజయానికి 14 పరుగులు అవసరం కాగా బంతిని అందుకున్న నటరాజన్‌ కేవలం 6 పరుగులే ఇచ్చి భారత్‌కు విజయాన్ని అందించాడు. భారత్‌ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 50‌ ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులే చేసింది.
ఛేదనలో డేవిడ్‌ మలన్‌(50: 50 బంతుల్లో 6ఫోర్లు) అర్ధశతకంతో రాణించగా బెన్‌స్టోక్స్‌(35), లియామ్‌ లివింగ్‌స్టోన్‌(36) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. చివర్లో సామ్‌ కరన్‌ పోరాటం వృథా అయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, శార్దుల్‌ ఠాకూర్‌ ప్రత్యర్థిని భారీ దెబ్బకొట్టారు.
 
8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన టెయిలెండర్ శామ్ కర్రాన్(95 నాటౌట్: 83 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు) అదిరిపోయే ఇన్నింగ్స్‌తో టీమిండియాకు చెమటలు పట్టించాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో 8వ నెంబర్ బ్యాట్స్‌మన్‌గా వచ్చి ఇన్ని పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే ఇంగ్లండ్ తరపున ఈ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా శామ్ కర్రాన్ కావడం విశేషం.
 
అంతకుముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. శిఖర్‌ ధావన్‌(67:56 బంతుల్లో 10ఫోర్లు), రిషబ్‌ పంత్‌(78: 62 బంతుల్లో 5ఫోర్లు,4సిక్సర్లు), హార్దిక్‌ పాండ్య(64: 44బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత అర్ధశతకాలతో రాణించడంతో భారత్‌ భారీ స్కోరు సాధించింది.
ఆరంభంలో రోహిత్‌ శర్మ(37), ఆఖర్లో శార్దుల్‌ ఠాకూర్‌(30) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మార్క్‌వుడ్‌ మూడు వికెట్లు తీయగా..అదిల్‌ రసీద్‌ రెండు వికెట్లతో చెలరేగాడు.