బెంగాల్‌లోని ఆ 30 సీట్ల‌లో 26 బీజేపీవే

ప‌శ్చిమ బెంగాల్‌లో శ‌నివారం 30 స్థానాల‌కు జ‌రిగిన తొలి విడ‌త ఎన్నిక‌ల్లో 26 సీట్ల‌లో గెలుపు బీజేపీదేన‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బూత్ స్థాయి కార్య‌క‌ర్త‌ల‌తో సంప్ర‌దించిన త‌ర్వాతే తాను ఈ విష‌యం చెబుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 

ఇక అటు అస్సాంలో తొలి విడ‌త‌లో భాగంగా 47 సీట్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో 37 స్థానాల్లో గెలుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. చాలా ఏళ్ల త‌ర్వాత ప‌శ్చిమ బెంగాల్‌లో ఎలాంటి హింస లేకుండా పోలింగ్ జ‌రిగింద‌ని ఆయ‌న సంతోషం వ్యక్తం చేశారు

బీజేపీకి ఓట్లు వేసినందుకు మ‌హిళ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు అమిత్ షా చెప్పారు. 200కుపైగా సీట్ల‌తో ప‌శ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఇలా ఉండగా, బీజేపీ నేత ముకుల్ రాయ్ ఫోన్ కాల్‌ను ఎవ‌రు ట్యాప్ చేశారో తాను తెలుసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు అమిత్ షా ఈ సంద‌ర్భంగా చెప్పారు. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తాను ఎన్నిక‌ల సంఘాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల‌న‌ని ముకుల్ రాయ్ చెప్పిన‌ట్లు ఆ కాల్‌లో స్ప‌ష్టంగా ఉంది. 

దీనిపై స్పందించిన అమిత్ షా అధికారుల బ‌దిలీకి సంబంధించిన డిమాండ్లు ఆ ఫోన్ కాల్‌లో ఉన్నాయ‌ని చెప్పారు. ఈ డిమాండ్ల‌ను లిఖిత‌పూర్వ‌కంగానే ఇచ్చామ‌ని, ఇందులో ర‌హ‌స్య‌మేమీ లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అస‌లు ప్ర‌శ్న ఇది కాద‌ని, అస‌లు ఫోన్ కాల్‌ను ఎవ‌రు ట్యాప్ చేశారో తెలియాల‌ని ఆయ‌న స్పష్టం చేశారు.