
జమ్ముకశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే సందర్శకులు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. జూన్ 28వ తేదీ నుంచి పహల్గామ్, బాల్టాట్ పట్టణాల నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. 56 రోజుల పాటు సాగే ఈ యాత్రలో సందర్శకులు 3,880 మీటర్ల ఎత్తున గల అమర్‌నాథ్ ఆలయం వద్ద మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు. ఆగస్టు 22న ఈ యాత్ర ముగుస్తుంది.
పహల్‌గామ్, బాల్టాట్ రూట్లలో యాత్రకు వెళ్లే వారు దేశవ్యాప్తంగా పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 316, జమ్ము కశ్మీర్ బ్యాంకుకు చెందిన 90, యెస్ బ్యాంకుకు చెందిన 40 గుర్తింపు పొందిన శాఖల్లో రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకోవచ్చునని శ్రీ అమర్‌నాథ్‌జీ దేవస్థాన బోర్డు (ఎస్ఏఎస్బీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) నితీశ్వర్ కుమార్ తెలిపారు.
దేవస్థానం బోర్డు వెబ్‌సైట్‌లో రాష్ట్రాల వారీగా సంబంధిత బ్యాంకుల శాఖల వివరాలు, అప్లికేషన్ ఫామ్, రిజిస్ట్రేషన్ విధానం తదితర పూర్తి వివరాలు తెలుసుకోవచ్చునని నితీశ్వర్ కుమార్ చెప్పారు. కొవిడ్-19 నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం 13 ఏండ్లలోపు బాలలు, 75 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, ఆరు నెలలకు పైగా గర్భిణులను ఈ యాత్రకు అనుమతించబోమని స్పష్టం చేశారు.
ప్రతి రోజూ, ప్రతి మార్గంలో యాత్ర విభిన్నమైన కలర్ కోడ్‌తో యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. బాల్టాల్, పహల్‌గామ్‌లలోని కంట్రోల్ గేట్ల వద్ద పోలీసు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. మార్చి 15 తర్వాత ఆరోగ్యశాఖ ధ్రువీకరించిన హెల్త్ సర్టిఫికెట్లను యాత్రికులు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే, హెలికాప్టర్ మార్గంలో యాత్రకు వెళ్లే వారు మాత్రం ముందస్తు అనుమతి తీసుకోనవసరం లేదని నితేశ్వర్ కుమార్ పేర్కొన్నారు. హెలికాప్టర్ యాత్రికులు ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్‌లో వైద్యుడి ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ద్వారా అధికారం పొందిన వైద్యులు లేదా మెడికల్ ఇన్‌స్టిట్యూట్స్ భక్తులకు జారీ చేసిన హెల్త్ సర్టిఫికేట్లను మాత్రమే రిజిస్టర్డ్ బ్యాంక్ బ్రాంచ్‌లలో అనుమతిస్తారని తెలిపారు. అమరనాథుని దేవాలయం అత్యంత ఎత్తులో ఉన్నందువల్ల, అక్కడికి చేరుకోవడానికి ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నది కావడం వల్ల హెల్త్ సర్టిఫికేట్లు తప్పనిసరి అని తెలిపారు. 2021 మార్చి 15 తర్వాత జారీ చేసిన హెల్త్ సర్టిఫికేట్లను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.
More Stories
2024లో తీవ్ర స్థాయికి బాలలపై హింస
కోయంబత్తూర్ కారు బాంబు కేసులో మరో నలుగురు అరెస్ట్
వీసాల అనిశ్చితతో అమెరికాలో చదువులపై వెనకడుగు!