
బంగ్లాదేశ్‌లో ఉన్న శక్తి పీఠం జెశోరేశ్వరి కాళీ ఆలయాన్ని ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. రెండు రోజల పాటు బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఆయన ఆ ఆలయంలో ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్‌కిరా జిల్లాలోని ఈశ్వరిపుర్ గ్రామంలో జెశోరేశ్వరి ఆలయం ఉన్నది.
ఈ సందర్భంగా ‘‘ఈ రోజు కాళీదేవికి నమస్కరించా. ఈ శక్తిపీఠాన్నిసందర్శించే అవకాశం నాకు దక్కింది. కోవిడ్-19 నుంచి సమస్త జాతిని విముక్తం చేయాలని ప్రార్థించా.’’ అని మోదీ తెలిపారు. ఇక్కడ కాళీమాత మేళా చాలా అద్భుతంగా జరుగుతుందని ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారని తెలిపారు.
భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి, ఓ కమ్యూనిటీ హాల్ అవసరం ఉందని, అది ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆకాంక్షించారు. అంతేకాకుండా సామాజిక, సాంఘిక, మత కార్యకలాపాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. మరీ ముఖ్యంగా తుపాను లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ నిర్మాణపు పనులను భారత ప్రభుత్వం చూసుకుంటుందని ప్రధాని మోదీ ప్రకటించారు.
దుర్గామాతకు చెందిన 51 శక్తి పీఠాల్లో జెశోరేశ్వరి ఆలయం కూడా ఒకటి. జెశోర దేవి పేరు మీద ఆ ఆలయం వెలసినది. బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రసిద్ధ ఆలయాల్లో ఇది ఒకటి. ప్రతి ఏడాది వేల సంఖ్యలో భారత్‌లోని హిందువులు ఈ ఆలయాన్నిసందర్శిస్తుంటారు. కాళీ పూజ జరిగే రోజున ఇక్కడకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 13వ శతాబ్ధంలో ఈ ఆలయంలో జీర్ణోద్దరణ జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. లక్ష్మణసేన, ప్రతాపాధిత్య ఈ ఆలయ పునర్ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.
More Stories
సంయుక్త ప్రకటన లేకుండా ముగిసిన జి7 సదస్సు
పాకిస్థాన్‌ను ఉపేక్షించడం అమానుషానికి తావు ఇవ్వడమే
ఇరాన్ నుండి 10వేల మందికి పైగా భారతీయుల తరలింపు!