బీజేపీ తిరుపతి అభ్యర్థిగా రత్నప్రభ 

బీజేపీ తిరుపతి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారిని రత్నప్రభ పేరు ఖరారు అయింది. ఆమె పేరును బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. కర్నాటక ప్రభుత్వ కార్యదర్శిగా గతంలో రత్నపభ పనిచే శారు. 
 
తిరుపతి ప్రధానంగా విద్యా కేంద్రం కావడంతో ఇక్కడ ఉన్నత విద్యావంతులు ఎక్కువ. అలాగే నియోజకవర్గ పరిధిలోని ఓటర్లలోనూ విద్యావంతులు అధికంగా ఉన్నారు.  తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి బీజేపీ నుంచే బరిలోకి దించుతున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ.. కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారిని. ఆ రాష్ట్రంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ శాఖల్లో పనిచేశారు. కర్ణాటక సీఎ్‌సగా 2018లో పదవీవిరమణ చేసిన తర్వాత.. ఆమె ఆ రాష్ట్ర వొకేషనల్‌ స్కిల్స్‌ అథారిటీ చైర్‌పర్సన్‌ గా బాధ్యతలు నిర్వప్తించారు. 2019 ఏప్రిల్లో బీజేపీలో చేరారు.
గతంలో 1999లో తెలుగు దేశం పార్టీ మద్దతుతో బిజెపి తిరుపతి  లోక్ సభ స్థానమును గెల్చుకొంది.

తిరుపతి వైసిపి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు‌ కరోనాతో కన్నుమూశారు. దుర్గాప్రసాద్ అకాలమరణంతో తిరుపతి లోక్‌సభకు ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అందరికంటే ముందుగా టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చాలా ముందుగానే ప్రకటించారు. ఆమె ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు.
వైసీపీ అభ్యర్థిగా తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు డాక్టర్‌ ఎం.గురుమూర్తి పేరును సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  అధికారికంగా ప్రకటించారు. తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలో చిత్తూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు.. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి సెగ్మెంట్లు ఉన్నాయి.