
ఈ నెల 31న తాను పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల నిర్వహణకు తగిన సమయం లేదని ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం షెడ్యూల్ విడుదల చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నాలుగు వారాలు ఎన్నికల కోడ్ విధించాలన్న బాధ్యతను నెరవేర్చలేనని తెలిపారు. ప్రస్తుతం సిబ్బంది అంతా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నిమగమయ్యారని, ఈ సమయంలో ఎన్నికల షెడ్యూల్ జారీ చేయలేనని తేల్చి చెప్పారు. ఎన్నికల నిర్వహణ రాబోయే ఎస్‌ఇసి భుజ స్కందాలపై ఉంటుందని తెలిపారు.
కోర్టు కేసుల్లో ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం పరిషత్ ఎన్నికలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్న ఆయన.. తదనుగుణంగా బుధవారం ఉత్తర్వులిచ్చారు. కరోనా కారణంగా పరిషత్ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని.. ఈ సందర్భంగా కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన గుర్తుచేశారు.
హైకోర్టు ఆదేశాల ప్రకారం పరిషత్ ఎన్నికల్లో ఇప్పటికే ఏకగ్రీవంగా గెలిచినట్లు ఫామ్-10 పొందిన వారి విషయంలో ఎలాంటి విచారణా చేపట్టేది లేదని తెలిపారు.అయితే అభ్యర్థులు తమ నామినేషన్ల పత్రాల విషయంలో ఎక్కడైనా రిటర్నింగ్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారనుకుంటే. కలెక్టర్లకు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. వాటిపై కలెక్టర్లు విచారణ చేపట్టాలని.. తప్పిదాలు జరిగినట్లు విచారణలో తేలితే కలెక్టర్ల సిఫారసుల మేరకు ఎన్నికల చట్టం అమలుచేస్తూ సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఆదేశాలిస్తున్నట్లు ఎస్‌ఇసి స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత చిత్తశుద్ధితో ఎలాంటి సంఘటనలు జరగకుండా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరపనుందని.. కరోనా సెకండ్ వేవ్ అంచనాతో కమిషన్ తీసుకుంటున్న జాగ్రత్తలను రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తీసుకోవలసి ఉంటుందని నిమ్మగడ్డ తెలిపారు.
More Stories
యోగా దినోత్సవంకు ముస్తాబవుతున్న విశాఖ
గోదావరి జలాలపై కలిసి మాట్లాడుకొందాం
ప్రముఖ సాహితీవేత్త పులిచెర్ల సాంబశివరావు ఇక లేరు