బెంగాల్ లో బిజెపికి 200 సీట్లు ఖాయం 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా స్థానాలు గెలుచుకోవడం ఖాయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భరోసా వ్యక్తం చేశారు. ఇవాళ పశ్చిమ బెంగాల్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. ‘‘2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 పైగా స్థానాల్లో విజయం సాధించగలదని కచ్చితంగా చెప్పగలను” అంటూ  ధీమా వ్యక్తం చేశారు. 

“ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారం నడుచునేదే తప్ప అహంకారంతో నడవదని బెంగాల్ ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది…’’ అని రాజ్‌నాథ్ హితవు చెప్పారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన జోయ్‌పూర్, తల్డాంగ్రా, కాక్‌ద్వీప్ అసెంబ్లీ స్థానాల్లో పర్యటించనున్నారు.

ఇలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీని చాయ్‌వాలా అని హేళన చేసినవారు ఇప్పుడు తేయాకు తోటల్లో ఆకులు వేరుకొని అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు.

 2014 సాధారణ ఎన్నికలకు ముందు మోదీని చాయ్‌వాలా అంటూ మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ అన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లో లేరు. 2017 నాటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మళ్లీ మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనను పార్టీ నుంచి తొలగించారని పేర్కొన్నారు.

అయితే, తాజాగా అస్సాం పర్యటనలో భాగంగా కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా.. తేయాకు తోటల్లో కనిపించారు. తేయాకు కార్మికులతో కలిసి తేయాకు ఆకులు తెంపుతూ కనిపించారు. దీనిని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాజ్‌నాథ్ ఆ వ్యాఖ్యలు చేశారు. 

‘‘కొంత కాలం క్రితం మన ప్రధానమంత్రిని చాయ్‌వాలా అంటూ హేళన చేశారు. ఈరోజు వాళ్లే తేయాకు తోటల్లో ఆకులు తెంపుకొని అమ్ముకుంటున్నారు. అసలైన చాయ్‌వాలా వారిని తేయాకు తోటల్లోకి తీసుకువచ్చారు. అయితే అసలైన చాయ్‌వాలా ఎవరనేది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ  అస్సాంలోని లుండింగ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాజ్‌నాథ్ అన్నారు.