ఎన్నికల ప్రచారంలో  అన్నాడీఎంకే ఎంపీ మృతి 

ఎన్నికల ప్రచారంలో  అన్నాడీఎంకే ఎంపీ మృతి 

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో గుండెపోటుకు గురైన రాజ్యసభ సభ్యుడు ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూశారు. ఆయనే తమిళనాడుకు చెందిన మహ్మద్‌ జాన్‌ (72). ఆయన అన్నాడీఎంకే తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఎన్నికల వేళ అన్నాడీఎంకే విషాదంలో మునిగింది. అతడి మృతికి అన్నాడీఎంకే, డీఎంకే, ఏఎంకే ఇతర పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. రాణిపేటలోని మాస్క్యూ వీధిలో ఉన్న తన నివాసంలో జాన్‌ మంగళవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఛాతీనొప్పి వచ్చింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.

మహ్మద్‌ జాన్‌ 2011లో రాణిపేట ఎమ్మెల్యేగా గెలిచి జయలలిత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మృతితో రాణిపేట నియోజకవర్గం విషాదంలో మునిగింది. రాణిపేట నియోజకవర్గంలో ఆయన గత కొన్ని రోజులుగా అన్నాడీఎంకే అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. 

రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు జాన్‌ మద్దతు ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో ఆయన నియోజకవర్గంలోని ముస్లింలు జాన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆ తర్వాత స్థానిక జమాత్‌లో నిర్వహిస్తున్న పదవి నుంచి ఆయనను తొలగించారు.