మొత్తం వ‌డ్డీ మాఫీ సాధ్యం కాదు

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌తేడాది బ్యాంకు రుణాల‌పై ఆరు నెల‌ల మార‌టోరియం విధించిన విష‌యం తెలుసు క‌దా. ఈ కాలానికిగాను మొత్తంగా వ‌డ్డీ మాఫీ చేయాల‌ని, మార‌టోరియం కాలాన్ని పొడిగించాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం త‌న తీర్పు వెల్ల‌డించింది. 
 
ఈ ఆరు నెల‌ల కాలానికి రుణ గ్ర‌హీత‌కు వ‌డ్డీ మీద వ‌డ్డీ వ‌సూలు చేయ‌రాద‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. అదే స‌మ‌యంలో మార‌టోరియం కాలాన్ని పొడిగించ‌డం సాధ్యం కాద‌న్న కోర్టు మొత్తం వ‌డ్డీ మాఫీ చేయ‌డం కూడా కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. ఖాతాదారుల‌కు, పెన్ష‌న‌ర్ల‌కు బ్యాంకులు వ‌డ్డీ చెల్లిస్తాయ‌ని, అలాంట‌ప్పుడు బ్యాంకులు ఎలా రుణాల‌పై పూర్తిగా వ‌డ్డీ మాఫీ చేస్తాయ‌ని కోర్టు ప్ర‌శ్నించింది. 
జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిస‌భ్య ధర్మాస‌నం ఈ కీల‌క‌మైన తీర్పు వెలువ‌రించింది. ఆ ఆరు నెల‌ల మారటోరియం కాలంలో వ‌డ్డీపై వ‌డ్డీ ఉండ‌కూడ‌దు. ఒక‌వేళ అలా సేక‌రించి ఉంటే వెంట‌నే రీఫండ్ చేయాల‌ని తీర్పు వెలువ‌రించే సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎంఆర్ షా స్ప‌ష్టం చేశారు. వ‌డ్డీపై వ‌డ్డీని మాఫీ చేయాల‌ని కోరుతూ గ‌తేడాది ప‌లు పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి.
 
గ‌తేడాది క‌రోనా కార‌ణంగా మార్చి నుంచి ఆగ‌స్ట్ 31 వ‌ర‌కు రుణాల‌పై మార‌టోరియం విధిస్తున్న‌ట్లు మార్చి 27న ఆర్బీఐ ప్ర‌క‌టించింది. ఈ ఆరు నెల‌ల స‌మ‌యంలో వ‌డ్డీపై వ‌డ్డీని పూర్తిగా మాఫీ చేస్తే అది ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌ని, బ్యాంకుల ఆర్థిక వ‌న‌రుల‌కు పెద్ద దెబ్బ ప‌డుతుంద‌ని ఆర్బీఐ వాదించింది.
మార‌టోరియం కాలంలో రుణాల వ‌డ్డీ వ‌సూళ్లు చేయ‌రాద‌ని సుప్రీంకోర్టు ఆదేశించ‌డంతో ప్ర‌భుత్వ ఖ‌జానాపై సుమారు రూ.7500 కోట్ల నుంచి రూ. 14వేల కోట్ల‌ భారం ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే, స‌కాలంలో రుణాలు తీసుకున్న వారిని మొండి బ‌కాయిలుగా ప్ర‌క‌టించ‌వ‌ద్ద‌న్నఆదేశాల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ది. క‌రోనా రిలీఫ్ చ‌ర్య‌ల్లో భాగంగా కేంద్రం రుణ వాయిదాల వ‌సూళ్ల‌పై మార‌టోరియం విధించినందున ఆయా రుణాల‌పై వ‌డ్డీ మాఫీ అవుతుంద‌ని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది.