పీఆర్సీ ఇవ్వరనే భయంతో టీఆర్‌ఎస్‌కు‌ ఓటేశారు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ పెరిగిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ  బీజేపీ ఓటమి లక్ష్యంగా కొన్ని పార్టీలు పని చేశాయని మండిపడ్డారు.  టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు లేవని సీఎం కేసీఆర్‌కు అర్థమైందని తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్‌ బయటకు రాకుండా వేరే పార్టీ నేత ముఖం పెట్టుకుని వచ్చారని మండిపడ్డారు. 

బీజేపీతో టీఆర్ఎస్‌లో భయం పట్టుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్  చేశారు. బంగారు తెలంగాణలో గత పీఆర్సీ కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ భయంతో కేసీఆర్ ముఖంలో నవ్వు కరువైందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ గెలిచిందని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.

ఉద్యోగులను మానసికంగా ఇబ్బంది పెట్టారని బండి సంజయ్‌ మండిపడ్డారు. పట్టభద్రులు టీఆర్ఎస్‌ మీద ప్రేమతో ఓటు వేయలేదని, పీఆర్సీ ఇవ్వరని భయపడే టీఆర్ఎస్‌కు ఓటేశారని తెలిపారు. పీఆర్సీ ఇవ్వకపోతే సీఎం కేసీఆర్‌ తలదించుకునేలా చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగ నోటిఫికేషన్‌, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

70 శాతం మంది ఓటర్లు టీఆర్ఎస్‌ను వ్యతిరేకించారని చెప్పా రు. ఓట్లు చీలడం వల్లే టీఆర్ఎస్ గెలిచిందని, గుర్రం బోడు, భైంసా ఘటనలు, తమ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడులను మరచిపోమని తెలిపారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అన్ని కేంద్రం ఇస్తే నువ్వు ఎందుకు ఇక్కడ అని ప్రశ్నించారు.