`ఎమర్జెన్సీ’ యోధులను స్వతంత్ర సమర యోధులుగా గుర్తించాలి 

1975-1977ల మధ్య దేశంలో ప్రజాస్వామిక హక్కులను అణచివేసి, ప్రతిపక్షాలకు చెందిన వారందరిని జైళ్లలో నింపిన ఇందిరా గాంధీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు అందరిని స్వతంత్ర పోరాట యోధులతో సమానంగా గర్హించాలని మాజీ శాసన సభ్యుడు, ఎమర్జెన్సీ సమయంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఏర్పాటు చేసిన విద్యార్థి, యువజన సంఘర్ష సమితి తెలంగాణ కన్వీనర్ నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. 

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో జగిత్యాలలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎమర్జెన్సీ  వ్యతిరేక పోరాట యోధుల సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ  ప్రజాస్వామ్య పరిరక్షణకోసం నాడు జరిగిన ఉద్యమం ద్వితీయ స్వతంత్ర సంగ్రామమని, లక్ష మందికి పైగా జైళ్లకు వెళ్లిన చరిత్రమక ఘట్టమని తెలిపారు. స్వతంత్ర పోరాట సమయంలో సహితం అంతమంది జైళ్లకు వెళ్లలేదని పేర్కొన్నారు.

ఆ సమయంలో మేధావులు అనుకున్న ఎందరో, సాధారణ సమయంలో పోరాట యోధులమని చెప్పుకున్న మరెందరో తోకముడిచి మౌనం వహించగా, సాధారణ విద్యార్థులు, యువజనులు నిర్భయంగా పోరాటం సాగించారని ఇంద్రసేనారెడ్డి గుర్తు చేశారు. వారి పోరాట స్ఫూర్తిని నేటితరంకు కూడా అందించడంకోసం వారికి తగు రీతిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాలని సూచించారు.

భారత్ సురక్ష సమితి రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ  దేశంలో 10కి పైగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎమర్జెన్సీ యోధులను స్వతంత్ర పోరాట యోధులుగా గుర్తించి వారికి పెన్షన్, వైద్య సహాయంతో పాటు పలు సదుపాయాలు కల్పిస్తున్నాయని తెలిపారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సదుపాయం కల్పించాలని తాము కోరుతున్నామని చెప్పారు. 

వరంగల్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్సీ టీ రాజేశ్వర్ రావు,  స్థానిక సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి, ఎసిఎస్ రాజు తదితరులు కూడా ప్రసంగించారు. నాటు ప్రజాస్వామ్య పరిరక్షణకోసం పోరాడిన ఎందరో నేడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు.