టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తిరిగి పొత్తు!  

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య 2004లో వలే పొత్తు కోసం తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? అందుకనే టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడం కోసం ఉరకలు వేస్తున్న నేతలు కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక పోతున్నారా? మాజీ ఎంపీ కొండా  విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక అసలు కారణం ఇదేనని తెలుస్తున్నది. 
 
ఎంపీ రేవంతరెడ్డిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయబోతున్నట్లు స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భరోసా ఇచ్చినప్పటికీ ఇంకా జాప్యం జరుగుతూ ఉండడం వెనుక కూడా ఇదే కారణమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటాలు చేయడంలో రేవంత్ రెడ్డికి అండగా ఉంటూ వస్తున్న విశ్వేశ్వర్‌రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీతో లాభం లేదనే బైటకు రావడం గమనార్హం. 
 
2019 ఎన్నికలకు ముందు   టీఆర్‌ఎస్ ఎంపీగా ఉంటూనే పార్టీకి, పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసి, ఓటమి చెందారు. టీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై పోరాటం కోసం తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరితే.. పార్టీ నాయకత్వం ఆ స్థాయిలో పోరాటం చేయట్లేదన్న అసంతృప్తి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలో గూడు కట్టుకుని ఉన్నట్లు చెబుతున్నారు.
 
కాంగ్రెస్‌ నేతలను సీఎం కేసీఆర్‌ బఫూన్లని తిట్టినా.. అదే స్థాయిలో విమర్శించేందుకు నాయకత్వం ముందుకు రాకపోవడంతో రెండు పార్టీ నేతల మధ్య లోపాయికారి సంబంధాలున్నట్లు వెల్లడి చేస్తుందని భావిస్తున్నారు.  రేవంత్‌రెడ్డి వంటి వారు కేసీఆర్‌పై మాటల దూకుడు ప్రదర్శిస్తే, సొంత పార్టీ నేతలే తప్పు పడుతున్నారన్న అభిప్రాయంతోనూ ఆయన ఉన్నారని చెబుతున్నారు.
 
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం కావించడం కోసం పార్టీ అధిష్టానానికి ఆరు అంశాల కార్యక్రమం ఒకటి సమర్పిస్తే, దాని గురించి పార్టీ అధినేతలు ఎవ్వరు పట్టించుకోక పోవడం పట్ల కూడా అసంతృప్తితో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై ప్రజాక్షేత్రంలో పోరాడే ఆసక్తి పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులు ఎవ్వరికీ లేదని స్పష్టం అవుతున్నది. 
 
దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలలో అధికార పక్షం అభ్యర్థి గెలుపొందడం కోసం కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని నిలబెట్టినదనే ప్రచారం జరిగింది. అదే విధంగా ఇప్పుటు నాగార్జున సాగర్ కు జరిగే ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు పరోక్షంగా సహకరించేందుకు అధికార పక్షం సిద్ధంగా ఉన్నదనే కధనాలు వెలువడుతున్నాయి. 
 
ఒక వంక బిజెపి ఉధృతంగా రాజకీయ ప్రత్యామ్న్యాయంగా ఎదుగుతూ ఉంటె, కాంగ్రెస్ మాత్రం అధికార పక్షంతో లాలూచి రాజకీయం చేస్తున్నదని సొంతపార్టీ నేతలే వాపోతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎదిరించాలంటే బిజెపి ద్వారా సాధ్యం అవుతుందనే ఇప్పటికే డీకే అరుణ, జి వెంకటస్వామి, పి సుధాకరరెడ్డి, విజయశాంతి వంటి బలమైన కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటి వారు సహితం అందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నది. 
 
ఇప్పటికే వరుస ఎన్నికల్లో ఓటములతో భవిష్యత్ ప్రశ్నార్ధకరంగా మారిన సమయంలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో సత్తా చాటడం ద్వారా, వచ్చే నెల జరిగే నాగార్జున సాగర్ ఉపఎన్నికలలో విజయం కైవసం చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి. 
 
రెండు చోట్ల కూడా ఆ పార్టీ అభ్యర్థులు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. నాలుగైదు స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్‌ పార్టీ మద్దతు కోసం చివరి వరకూ ఎదురు చూశారు. తీన్మార్‌ మల్లన్న, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కూడా కాంగ్రెస్‌ మద్దతు కోరారు. ఖమ్మం నుంచి గత ఎన్నికల్లో తీన్మార్‌ మల్లన్న కాంగ్రెస్‌ తరపునే పోటీ చేశారు. 
 
వారిలో ఎవ్వరికీ మద్దతు ఇచ్చినా హైదరాబాద్ లో పోటీ చేసిన ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డికి కొంత అండ లభించి ఉండెడిది. అయితే కేవలం టీఆర్ఎస్ అభ్యర్థులకు బలం చేకూర్చడం కోసమే కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను మట్టి కరిపించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.