దేశంలో ఒక్కరోజులో 25 లక్షల మందికి టీకాలు!

దేశంలో ఒక్కరోజులో 25 లక్షల మందికి టీకాలు!
దేశంలో ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండగా, మరోవైపు వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. గడచిన 24 గంటల్లో 25 లక్షలకుపైగా ప్రజలకు కరోనా టీకా వేశారు. జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, ఒక్కరోజులో 25 లక్షలకు పైగా ప్రజలకు టీకా వేయడం ఇది రెండవసారి. 
 
కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం దేశంలోని 25,40,449 మందికి కరోనా టీకా వేశారు. వీరిలో 45 ఏళ్లు పైబడిన 16.73 లక్షల మందికి తొలిడోసు టీకా వేశారు. ఇప్పటివరకూ దేశంలోని 4.51 కోట్లకు పైగా ప్రజలకు కరోనా టీకాలు వేశారు.

గత కొన్ని రోజులుగా దేశంలో పెరుగుతూ వస్తున్న పాజిటివ్‌ కేసులు, ఇవాళ రికార్డుస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల్లో ఈ ఏడాది ఇదే అత్యధికం కావడం విశేషం. 

అదేవిధంగా చాలా రోజుల తర్వాత మరణాలు రెండు వందలు దాటాయి. నిన్న ఉదయం నుంచి ఇప్పటివకు 212 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 1,16,46,081కు చేరాయి. ఇందులో 1,11,51,468 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,59,967 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు.

కాగా, 3,34,646 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 21,180 మంది బాధితులు కోలుకున్నారని వెల్లడించింది. దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 30 వేలు ఉండటం గమనార్హం.