ఆ ముగ్గురిని త్వ‌ర‌లోనే దేశానికి తీసుకొస్తాం 

అవినీతి, మోసం, రుణాల ఎగవేత‌కు పాల్ప‌డి విదేశాల‌కు పారిపోయిన విజ‌య్ మాల్య‌, నీర‌వ్ మోదీ, మెహుల్ చౌక్సీ త‌దిత‌రులను త్వ‌ర‌లోనే దేశానికి తీసుకొస్తామ‌ని కేంద్రం  కుండ‌బ‌ద్ధ‌లు కొట్టింది. మోసాల‌కు పాల్ప‌డినందుకు వారు భార‌త చ‌ట్టాల‌ను ఎదుర్కోవాల్సిందేన‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ స్ప‌ష్టం చేశారు.
 
రాజ్య‌స‌భ‌లో బీమా స‌వ‌ర‌ణ బిల్లుపై జ‌రిగిన చ‌ర్చ‌కు నిర్మ‌లా సీతారామ‌న్ స‌మాధానం ఇస్తూ  ఈ విషయమై  భరోసా ఇచ్చారు. ప్రస్తుతం బ్రిటన్ లో విచారణ ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ, విజ‌య్ మాల్యల  అప్ప‌గింత కోసం కేంద్రం బ్రిట‌న్ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ది.
 
ఇక నీరవ్ మోదీ మేన‌మామ మెహుల్ చౌక్సీ ప్ర‌స్తుతం అంటిగ్వాలో ఉన్న‌ట్లు వార్త‌లొచ్చాయి. ఆ దేశంతో భార‌త్‌కు  నేర‌స్తుల అప్ప‌గింత ఒప్పందం లేకున్నా.. భార‌త్‌లో అవినీతికి పాల్ప‌డినందుకు భార‌త ప్ర‌భుత్వం కోరితే అప్ప‌గించేందుకు సిద్ధం అని అంటిగ్వా అధినేత ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. 
 
మ‌ద్యం వ్యాపారి విజ‌య్ మాల్య.. కింగ్ ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ నిర్వ‌హ‌ణ కోసం వివిధ బ్యాంకుల నుంచి రూ.9000 కోట్ల పై చిలుకు రుణాలు తీసుకున్నారు. ఆ రుణాల‌ను చెల్లించ‌కుండా 2016లో బ్రిట‌న్‌కు వెళ్లిపోయి, అక్క‌డే ఉన్నారు. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వ ద‌ర్యాప్తు సంస్థ‌లు బ్రిట‌న్ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించాయి.
 
దీంతో విజ‌య్ మాల్య ఆర్థిక నేరాల‌పై బ్రిట‌న్ న్యాయ‌స్థానాలు విచార‌ణ జ‌రిపి ఆయ‌న‌ను దోషిగా తేల్చాయి. అయితే, బ్రిట‌న్‌లో విజ‌య్ మాల్య ఆశ్ర‌యం కోరిన‌ట్లు వార్త‌లొచ్చాయి. విజ‌య్ మాల్య ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డినందున ఆయ‌న‌ను అప్ప‌గించే విష‌య‌మై బ్రిట‌న్ హోంమంత్రి తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.
 
ఇక పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌లో నీర‌వ్ మోదీ, ఆయ‌న మేన‌మామ మెహుల్ చౌక్సీ రూ.14,500 కోట్ల మేర‌కు మోసానికి పాల్ప‌డ్డారు. ఈ కుంభ‌కోణం వెలుగు చూసే స‌మ‌యానికి వారిద్ద‌రూ విదేశాల‌కు పారిపోయారు. త‌ర్వాత నీర‌వ్ మోదీని బ్రిట‌న్ పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.