బెంగాల్ కు 725 సీఏపీఎఫ్ కంపెనీల బ‌ల‌గాలు

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ స్ప‌ష్టం చేశారు. బెంగాల్ ఎన్నిక‌ల బందోబ‌స్తు కోసం మొత్తం 725 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాల‌ను (సీఏపీఎఫ్‌) త‌ర‌లిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఇప్ప‌టికే 495 కంపెనీ బ‌ల‌గాలు బెంగాల్‌లో ప‌హారా కాస్తున్నాయ‌ని చెప్పారు. ఒక్కో కంపెనీలో 72 మంది భ‌ద్ర‌తా సిబ్బంది ఉంటార‌ని పేర్కొన్నారు. 2020 ఏడాదిలో మొత్తం 215 మంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన‌ట్లు కుల్దీప్ సింగ్ స్ప‌ష్టం చేశారు. ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది టెర్ర‌రిస్టులు హ‌త‌మ‌య్యార‌ని చెప్పారు.

కొద్దిరోజుల క్రితం రెండు ప్రాంతాల్లో న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టామ‌ని, వీరిలో జైషే క‌మాండ‌ర్ స‌జ్జ‌ద్ ఆఫ్ఘ‌నీ ఉన్న‌ట్లు తెలిపారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో గ‌తేడాది ఎనిమిది ద‌శ‌ల్లో జ‌రిగిన డీడీసీ ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించిన‌ట్లు పేర్కొన్నారు.

త‌మ ప‌క‌డ్బందీ చ‌ర్య‌ల వ‌ల్ల మావోయిస్టుల కార్య‌క‌లాపాల‌ను అరిక‌ట్ట‌గ‌లిగామ‌ని తెలిపారు. 2020లో 569, 2021లో 141 మంది మావోయిస్టులు ప‌ట్టుబ‌డ‌గా, 2020లో 340 మంది, 2021లో 108 మంది మావోయిస్టులు లొంగిపోయిన‌ట్లు తెలిపారు. 

ఇక 2020లో 32 మంది, 2021లో ఐదుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యార‌ని చెప్పారు. మార్చి 16న బీహార్‌లోని గ‌యా జిల్లాలో న‌లుగురు మావోయిస్టుల‌ను 205 కోబ్రా ద‌ళాలు మ‌ట్టుబెట్టాయ‌ని సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ పేర్కొన్నారు.