జగన్ ప్రభుత్వ తీరుతో ముందుకు సాగని రైల్వే లైన్లు!

రైల్వే లైన్ల నిర్మాణానికి అయ్యే వ్యయం పంచుకోవడంలో మారిన ఆంధ్ర ప్రదేశ్ (జగన్) ప్రభుత్వం వైఖరి రాష్ట్రంలో ప్రాజెక్టుల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విచారం వ్యక్తం చేశారు. లోక్‌సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అడిగిన ఓ ప్రశ్నకు బుధవారం కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

 ‘‘2015-16 బడ్జెట్‌లో ప్రకటించిన  కర్ణాటకలోని ఎలహంక – పెనుగొండ (120 కిమీ) లైను డబ్లింగ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,147 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశాం. ఇప్పటి వరకు రూ. 912 కోట్లు ఖర్చు చేసి 72 కిలోమీటర్ల మేర పూర్తి చేశాం. ఈ బడ్జెట్‌లో రూ. 160 కోట్లు కేటాయించాం. తమతమ భూభాగంలో చేపట్టే ప్రాజెక్టు కోసం కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలు 50 శాతం నిధులు భరించాలి” అని తెలిపారు.

“అయితే ఆ లెక్కన రూ. 200 కోట్లు ఇవ్వడానికి 2015లో అప్పటి ఏపీ ప్రభుత్వం అంగీకరించి రూ.50 కోట్లు డిపాజిట్‌ చేసింది. అనేకసార్లు గుర్తు చేసినప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం మిగతా నిధులు ఇవ్వలేదు. అయితే, మా సొంత వనరులను ఉపయోగించి ఎలహంక-పెనుగొండ లైనును పూర్తి చేయాలని నిర్ణయించాం’’ అని మంత్రి పీయూష్‌ వెల్లడించారు. 

ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు సగటున ఏటా రూ.2,830 కోట్లు కేటాయించామని, 2021 -22లో రూ. 5,812 కోట్లు బడ్జెట్‌లో పెట్టామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 841 కిలోమీటర్ల మేర  రూ. 10,200 కోట్ల వ్యయంతో నాలుగు కొత్త లైను ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు. 

అయితే, . రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టకపోవడం, తన వాటాగా ఇవ్వాల్సిన రూ.1,636 కోట్లు డిపాజిట్‌ చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్టులు నిలిచిపోయాయని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు మొత్తం రూ. 2,612 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని  వెల్లడించారు.