30 రోజుల్లో కొత్త వెహికిల్ స్క్రాప్ పాల‌సీ 

మ‌రో 30 రోజుల్లో కొత్త వెహికిల్ స్క్రాప్ పాల‌సీ నోటిఫికేష‌న్‌ను జారీ చేయ‌నున్న‌ట్లు కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వాహ‌నాల తుక్కుకు సంబంధించిన విధానంపై  లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న చేశారు. వెహికిల్స్ స్క్రాపింగ్ పాల‌సీతో.. ఓన‌ర్లు త‌మ వ‌ద్ద ఉన్న పాత వాహ‌నాల‌ను తుక్కు చేయ‌వ‌చ్చు అని తెలిపారు. 
 
అలాగే ఆ విధానంతో కొత్త వాహ‌నాల‌ను ఖ‌రీదు చేయ‌వ‌చ్చు అని తెలిపారు.  నౌక‌ల‌ను తుక్కు చేసే యార్డుల త‌ర‌హాలోనే వాహ‌నాల స్క్రాపింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు మంత్రి నితిన్ గ‌డ్క‌రీ వెల్ల‌డించారు. స్క్రాపింగ్ విధానంతో వాహ‌నాల‌కు చెందిన కాంపోనెంట్ల ధ‌ర 40 శాతం త‌గ్గ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 
 
కాలుష్యాన్ని త‌గ్గించే ఉద్దేశంతో ఎంపీలంద‌రూ బ‌యోఫ్యూయ‌ల్‌, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను వాడాల‌ని గడ్కరీ  సూచించారు. రిజిస్ట్రేష‌న్ చేసుకున్న వారికి ప్రోత్స‌హ‌కాలు ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఒక‌వేళ ఏదైనా వాహ‌నం ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లో విఫలం అయితే, ఆ వాహ‌నానికి ఎండ్ ఆఫ్ లైఫ్ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌నున్నారు.  20 ఏళ్ల త‌ర్వాత అన్‌ఫిట్ తేలితే.. ఆ వాహ‌నాన్ని డీ-రిజిస్ట‌ర్ చేయ‌నున్నారు.    
గెలుపు-గెలుపు విధానంతో కొత్త వాహ‌న తుక్కు చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు మంత్రి గ‌డ్క‌రీ తెలిపారు.  స్క్రాప్ ద్వారా ఉత్ప‌త్తి అయిన తుక్కును కొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీకి వినియోగించ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. కొత్త వాహ‌నాలు అతి త‌క్కువ బ‌రువులో ఉంటాయ‌ని, మెయింటేనెన్స్ కూడా చాలా త‌క్కువ అవుతుంద‌ని పేర్కొన్నారు.
 ప్ర‌తి ఒక్క‌రి ఆకాంక్ష‌ల‌కు త‌గిన‌ట్లు ఈ విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు మంత్రి గ‌డ్క‌రీ తెలిపారు. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఇంధ‌న సామ‌ర్థ్యం చాలా ఎక్కువ అని, దీని వ‌ల్ల సాధార‌ణ పౌరులు ల‌బ్ధి పొందుతార‌ని,  పెట్రోల్‌-డీజిల్ దిగుమ‌తి త‌గ్గుతుంద‌ని, ఇది మ‌రో ర‌కంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు లాభం చేకూరుతుంద‌ని మంత్రి వెల్ల‌డించారు.
ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై డిస్కౌంట్‌ను 20 శాతానికి పెంచాల‌ని ఆర్జేడీ ఎంపీ మ‌నోజ్ కుమార్ డిమాండ్ చేశారు.  ఫ్రిడ్జ్‌ను 20 వేలు పెట్టి కొంటామ‌ని, కానీ ఓ రోజు దాన్ని 500ల‌కే అమ్మేస్తామ‌ని,  మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు కొత్త వాహ‌నం కోసం అప్‌గ్రేడ్ కాలేర‌ని,  స్క్రాపింగ్ పాల‌సీ బాగానే ఉన్నా.. దాని విలువ 6 శాతం వ‌ర‌కు మాత్ర‌మే ఉంద‌ని, దీన్ని పెంచే ప్ర‌య‌త్నం చేయాల‌ని డీఎంకే ఎంపీ తిరుచి శివ డిమాండ్ చేశారు.
కొత్త ఉత్ప‌త్తులు, కొత్త మైలేజీ, కొత్త బ్రేకింగ్ సిస్ట‌మ్స్‌తో ఆదా అవుతున్న‌ద‌ని,  కోవిడ్ క‌న్నా ప్ర‌మాదాల వ‌ల్లే ఎక్కువ మంది మ‌ర‌ణిస్తున్నార‌ని మంత్రి గ‌డ్క‌రీ తెలిపారు.