ట్రాన్స్‌ ట్రాయ్‌పై దర్యాప్తు కొనసాగించొచ్చు  

ట్రాన్స్‌ ట్రాయ్‌పై దర్యాప్తు కొనసాగించొచ్చు  

బ్యాంకుల్ని మోసం చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌పై దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) లకు హైకోర్టు స్పష్టం చేసింది.

మాజీ టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం సవరించింది.

12 బ్యాంకుల కన్సార్టియం నుంచి ట్రాన్స్‌ట్రాయ్‌ పొందిన రుణ బకాయిలు 2019 సెప్టెంబర్‌ 18 నాటికి రూ.9,394 కోట్లకు చేరుకున్నాయి. ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు ఆ 12 బ్యాంకులు ట్రాన్స్‌ట్రాయ్‌ ఖాతాలను మోసపూరితమైనవిగా ప్రకటించాయి. దీన్ని ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రతినిధి చెరుకూరి శ్రీధర్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను జూలై 16కి వాయిదావేశారు.

ఇలా ఉండగా, బ్యాంకుల్ని మోసం చేశారన్న సీబీఐ కేసులో కోస్టల్‌ ప్రాజెక్ట్‌కు చెందిన సబ్బినేని సురేంద్రకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. బ్యాంకులకు రూ. 4,736 కోట్ల అప్పులు చెల్లించక పోవడంతో ఆ ఖాతాలు మోసపూరితమని బ్యాంకులు ప్రకటించాయి.

దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశామని సబ్బినేని న్యాయవాది చెప్పడంతో.. మోసపూరిత బ్యాంకు ఖాతాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవద్దని, అయితే సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేయవచ్చునని హైకోర్టు తెలిపింది.