నిమ్మగడ్డను శాసనసభా కమిటీ నోటీసు!

నిమ్మగడ్డను శాసనసభా కమిటీ నోటీసు!
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు శాసనసభా సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర మంత్రులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎస్‌ఇసిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలంటూ నోటీసులు పంపుతామని కమిటీ ఛైర్మన్‌ కాకాని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.
 
 బుధవారం సమావేశమైన శాసనసభా సభా హక్కుల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రమేష్‌కుమార్‌ పదవిలో ఉన్నా లేకున్నా కమిటీ ముందకు వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. 
 
కమిటీ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించగా,  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసులపై దృష్టి సారించనుంది. నిమ్మగడ్డపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసును అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీకి సభాపతి తమ్మినేని సీతారాం పంపారు. 
 
గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో తమను కించపరచేలా, ప్రతిష్ఠను దిగజార్చేలా ఎస్‌ఈసీ పేర్కొన్నారని, ఈ ఫిర్యాదులోని అంశాలపై సామాజిక మాధ్యమాలు తమ వ్యక్తిత్వాన్ని కించపరచేలా ప్రసారం చేశాయని స్పీకర్‌కు మంత్రులు ఫిర్యాదు చేశారు.
 
గతంలో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం అయింది. ఎస్‌ఈసీపై మంత్రులు ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై ప్రధానంగా చర్చించారు. అసెంబ్లీలోని రూల్‌ నెం 212, 213 కింద ఎస్‌ఈసీని పిలింపించవచ్చని సభ్యులు తెలిపారు. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలానే చేశారని ప్రివిలేజ్‌ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
 
 ఆర్టికల్‌ 243 ప్రకారం ఎస్‌ఈసీకి సర్వాధికారాలు ఉన్నాయని, అలాంటప్పుడు ఎలా పిలిపిస్తారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. మరో వారంలో ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా సమావేశం కావాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఈసీ అంశం కావడంతో విస్తృతంగా చర్చించాలని ప్రివిలేజ్‌ కమిటీ నిర్ణయించింది.