మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సిఐడి సోదాలు 

రాజధాని అమరావతి భూముల విషయంలో మాజీ మంత్రి పొంగూరి నారాయణకు ఏపీ సీఐడీ అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఇక ఆయనకు సంబంధించిన విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాల్లో కూడా సీఐడీ అధికారులు సోదాలు చేశారు.

కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న నారాయణ ఇంట్లో 41(ఎ) సి.ఆర్.పి.సి ప్రకారం నోటీసులు అందించారు. నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి ఉదయం 9.52 గంటలకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మార్చి 22న విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

మోసం, కుట్రతో అసైన్డ్‌ భూములు లాక్కొన్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణలపై ఎస్సీ, ఎస్టీ చట్టం సహా 10 సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేసులో భాగంగా తాజాగా నారాయణ విద్యాసంస్థలు, ఆఫీసుల్లో సీఐడీ సోదాలు నిర్వహించింది. 

విజయవాడ, హైదరాబాద్, నెల్లూరులో ఏకకాలంలో పది ప్రాంతాల్లో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాజధాని భూముల విషయంలో నారాయణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

కాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు… శుక్రవారం (ఈనెల 12న) సీఐడీ కేసు నమోదు చేసింది. మంగళవారం ఉదయం సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి 41(ఏ) సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు  విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న సీఐడీ రీజనల్‌ ఆఫీసుకు వ్యక్తిగతంగా హాజరు కావలెను’’ అని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. 

సీఐడీ సైబర్‌ సెల్‌ డీఎస్పీ ఐ.సత్యనారాయణ ‘దర్యాప్తు అధికారి’ హోదాలో చంద్రబాబుకు ఈ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుకు కట్టుబడి తమ ముందు హాజరుకాకపోయినా, ఇందులో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించినా 41ఏ(3), (4) సీఆర్పీసీ ప్రకారం చంద్రబాబును అరెస్టు చేయవచ్చునని కూడా స్పష్టం చేశారు. 

మాజీ మంత్రి నారాయణకు కూడా హైదరాబాద్‌లోనే నోటీసు అందించారు. చంద్రబాబు, నారాయణలను నిందితులుగా పేర్కొంటూ సీఐడీ క్రైమ్‌ నంబర్‌ 5/2021 నమోదు చేసింది. వారిపై  166, 167, 217, 120 (బి) ఐపీసీ రెడ్‌విత్‌ 34, 35, 36, 37 ఐపీసీలతోపాటు  ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌) (జి)లపైనా కేసు పెట్టారు.

తన నియోజకవర్గానికి చెందిన కొందరు రైతులు ఇచ్చిన వినతిపత్రం మేరకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలోని కొందరు పరపతి ఉన్న పెద్దలు మోసం చేసి, చట్ట విరుద్ధంగా, మోసపూరితంగా రైతుల భూములు లాక్కున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా అసైన్డ్‌ భూములు తీసేసుకుంటుందని కొందరు దళారులు చెప్పారు. దీంతో అమాయకులైన రైతులు ఆందోళనకు, అభద్రతాభావానికి గురయ్యారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు.