ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్‌ఈసీకి లేదు 

ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమీషన్ (ఎస్‌ఈసీ)కి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని హైకోర్టు ఎస్‌ఈసీని ఆదేశించింది. తక్షణమే ఎంపికైన అభ్యర్ధులకు డిక్లరేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే, గత ఏడాది మార్చ్15న కరోనా కారణంగా జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడే సమయానికి నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తి అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్ధానాలకి నోటిఫికేషన్ విడుదల కాగా, 8 జెడ్పీటీసీ స్ధానాలకు కోర్టు వివాదాలతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. మిగిలిన 652 జెడ్పీటీసీ స్ధానాలకి 126 జెడ్పీటీసీలు వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవం అయ్యాయి. 

 ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి ఎవరైనా బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాల కారణంగా నామినేషన్ వేయలేకపోయారో వారు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు జరిపి.. అది నిజమని తేలితే వాళ్లను మళ్లీ అభ్యర్థిగా పరిగణిస్తామని ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొంతమంది ఏకగ్రీవమైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 

దీనిపై సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు గతంలో తీర్పును రిజర్వు చేసింది. తాజాగా మంగళవారం దీనిపై విచారణ జరిపిన న్యాయం స్థానం.. గతంలో ఏకగ్రీవమైన వారికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశిస్తూ, ఏకగ్రీవాలపై దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని తీర్పు వెలువరించింది. 

వైఎస్సార్ కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్ధానాలకు 38, చిత్తూరులో‌ 65 స్ధానాలకి 30, కర్నూలు జిల్లాలో 53 స్ధానాలకి 16, ప్రకాశంలో 56 స్ధానాలకి 14 జెడ్పీటీసీ స్ధానాలు, నెల్లూరులో 46కు 12, గుంటూరులో 57కు 8 స్ధానాలు, కృష్ణాలో 49కి రెండు స్ధానాలు, పశ్చిమ గోదావరి 48కి రెండు స్ధానాలు, విజయనగరంలో 34 స్ధానాలకు మూడు, విశాఖపట్నంలో 39కి ఒక జెడ్పీటీసీ స్థానం వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవం అయింది. 

అనంతపురం, శ్రీకాకుళం, తూర్పుగోదావరిలో ఏకగ్రీవాలు కాలేదు. ఏకగ్రీవాలైన 126 మంది జెడ్పీటీసీలను అధికారికంగా ప్రకటించి మిగిలిన 526 జెడ్పీటీసీ స్ధానాలకు ఎస్‌ఈసీ ఎన్నికలు జరిపించాల్సి ఉంది.